వావ్.. నాలుగు లక్షలకే నచ్చిన కారు..

పెరుగుతున్న అవసరాలు.. మారుతున్న పరిస్థితులు.. మార్కెట్లో అందుబాటు ధరలో ఉంటున్న పాత కార్లు.. సామాన్యుడి సరదా తీరుస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ కార్లని చిన్న చూపు చూడాల్సిన పనిలేదు. మరీ అంత బావుండక పోతే కొత్త కార్ల షోరూంలోనే పాత కార్లు అమ్మకానికి పెట్టరు.

ఇప్పుడు వీటికి పెరిగిన గిరాకీ దృష్ట్యా ప్రముఖ కార్ల కంపెనీ షోరూంలన్నీ యూజ్డ్ కార్లకు లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇంతకు ముందు పాత కార్లకు లోన్ దొరకాలంటే కష్టమయ్యేది. కానీ కష్టమర్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని వారిని ప్రోత్సహించే దిశగా కంపెనీలే ఆ ఏర్పాట్లు చూస్తున్నాయి.

పండగ సీజన్‌లో అయితే పాత కార్లకు మరింత గిరాకీ ఉంటుందని కంపెనీ యాజమాన్యం అంటోంది. ఆర్గ‌నైజ్డ్ యూజ్డ్ కార్ మార్కెట్ ఈ ఏడాది 40 నుంచి 50 శాతం వృద్ధి సాధించింది. మార్కెట్లోకి రోజుకో కొత్త కారు వస్తోంది. పాత వెర్షన్ కార్ల ధరలు పడిపోతూ ఉంటాయి.

దీంతో పాత కార్లన్నీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి చేరిపోతున్నాయి. పాత కారుకి కొత్త కారుకి లక్షల్లో వ్యత్యాసం ఉండడంతో పాత వాటివైపు మొగ్గు చూపుతున్నారు వినియోగదారులు. దేశ రాజధాని ఢిల్లీలో పాత కార్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి.

మారుతీ సుజుకీ స్విప్ట్ వితారా బ్రీజా, హ్యుందాయ్ ఐ10 గ్రాండ్, ఐ20, హోండా సిటీ, మహింద్రా స్కార్పియో లాంటి కార్లు ముందువరుసలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగర వాసులు మారుతి సుజుకి స్విప్ట్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. తరువాతి స్థానాల్లో మారుతి సుజుకీ డిజైర్, హోండా సిటీ, ఫోక్స్ వాగన్ వెంటో, హ్యుందాయ్ ఐ10 లాంటి కార్లు ఉన్నాయి.

హైదరాబాద్‌లో రూ.3 లక్షల నుండి రూ.4 లక్షల మధ్య గల కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని ఓ షోరూం యజమాని తెలిపారు. కొన్ని షోరూంలలో సెడాన్, ఎస్యూవి విభాగాల్లో నెలకు 10 నుంచి 15 కార్ల వరకు అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.