అర చేతిలో వైకుంఠం.. రోజుకి 2 గంటల కష్టం.. లక్షల్లో ఆదాయం

డబ్బంటే ఎవరికి చేదు. అందులో ఎక్కువ కష్టపడకుండా.. ఎవరి కాళ్లూ పట్టుకోకుండా లక్షల్లో ఆదాయాన్ని ఆర్జించవచ్చంటే ఎక్కడ.. ఎక్కడ అంటూ అక్కడికే పరుగులు పెట్టేస్తుంటారు అన్నీ తెలిసిన వారు సైతం. రోజూ పొద్దున్న లేస్తే పేపర్లో వచ్చే ప్రకటనలు.. కంప్యూటర్ ఆన్ చేయగానే కనిపించే స్క్రోలింగ్, వద్దంటే వచ్చే మెసేజ్‌‌లు ఒక నిమిషం ఆలోచించుకోనివ్వకుండా చేస్తుంటాయి.

పది పాసైతే చాలు అని ఒకరు.. డిగ్రీ పూర్తయి ఏళ్లు గడిచినా ఉద్యోగం లేదా అని మరొకరు.. ఇలా వీక్‌నెస్ మీద దెబ్బకొడతారు. అక్కడ మనలాంటి మరికొందరు ఎదురు పడతారు. అందరికీ కలిపి డిజిటల్ బోర్డు మీద లెక్కలు వేసి కళ్ల ముందు కాసులు కురిపించే మార్గాన్ని చూపిస్తారు.

మీటింగ్ మొత్తం అయిపోయాక.. సింపుల్‌గా ఓ రెండు లక్షలు డిపాజిట్ చేసారంటే ఆరు నెలలు తిరక్కుండానే రెట్టింపు ఆదాయం మీ సొంతం అవుతుందంటూ ఊరిస్తుంటారు. అదంతా నిజం కాదు నమ్మొద్దు అని మనసు హెచ్చరిస్తున్నా.. నేనొక్కడినే అయితే అనుకోవచ్చు.. ఇంత మంది మోసపోతారా ఏంటి అని మనకి మనమే సర్థిచెప్పుకుని, ఇంట్లో వారికి ఏదో ఒకటి సర్థి చెప్పి అడిగినంత సొమ్ము వారికి ముట్టచెబుతారు.

ఆనక అపాయింట్ మెంట్ ఆర్డర్ ఎప్పుడిస్తారంటూ చెప్పులరిగేలా ఆ కంపెనీల చుట్టూ తిరుగుతారు. అందరి దగ్గరా డబ్బు తీసుకుని బోర్డు ఎత్తేస్తుంది సదరు కంపెనీ. ఇలా ఎక్కువగా మోసపోతున్న వారిలో యువకులు, గృహిణులు ఎక్కువగా ఉంటున్నారని హైదరాబాద్ నగరం సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి.

రోజుకి ఎనిమిది గంటల ఉద్యోగం.. ఆఫీసుకి రావడానికి మరో రెండు, మూడు గంటలు కష్టపడితేనే నెలకు జీతం వేలల్లో వస్తుంది. మరి అలాంటిది ఇంట్లో కూర్చునే.. అదీ రెండు గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.2 లక్షల ఆదాయం అంటే ఆలోచించాలి కదా.

ఇక మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడతారు. చక్కగా సూటు బూటు వేసుకుని, మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడేస్తూ మాటలతో మాయ చేస్తారు. తాను ఉద్యోగంలో చేరి కేవలం ఆరు నెలలే అయిందని, ఒకప్పుడు బైక్ కొనడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి ఉంటే ఇప్పుడు కారులో తిరుగుతున్నానని తననే ఉదాహరణగా చూపిస్తాడు. మీటింగ్ విటున్న వారిని ఊహల్లో విహరింపజేస్తాడు.

కాసేపు ఆ ట్రాన్స్‌లోనించి బయటకు వచ్చిన తరువాత స్కీముల గురించి బయటపెడతాడు. అందులో కొన్ని రకాల హెర్బల్ బ్యూటీ ప్రొడక్టులు ఉంటాయి, మరి కొన్ని హెల్త్ ప్రొడక్టులు ఉంటాయి, కొన్ని యాంటీ రేడియేషన్ చిప్స్‌ను గురించి, మరి కొన్ని ఇతర ప్రొడక్టులను కూడా మార్కెటింగ్ చేస్తుందని నమ్మిస్తారు.

మళ్లీ ఇందులో మరో మతలబు కూడా ఉంటుందండోయ్.. అదే.. మీ కోసమే అయితే అతి తక్కువ ధరకు వస్తుంది. మీరు నమ్మి మరో ఇద్దరిని నమ్మించి జాయిన్ చేశారనుకోండి.. అందుకుగాను కంపెనీ 25 శాతం కమీషన్ ఇస్తుంది. దాంతో మీరు పెట్టిన పెట్టుబడి వెంటనే మీ చేతికి వస్తుంది. ఇలా ఎంత మందిని చేరిస్తే అంత కమీషన్.. ఇంకేముంది లక్షల్లో ఆదాయం మీ సొంతం.

ఇలా వచ్చిన వారిని మాటలతో బురిడీ కొట్టించి ఊబిలోకి దించుతున్నారు. వేలాది మందిని చేర్పించి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటిదే రాథేశ్యామ్ ముఠా ప్యూచర్ మేకర్ స్కాం, నగరానికి చెందిన ఐఐటీ డ్రాపవుట్స్ ముఠా, ప్రో హెల్తీవేజ్ ఇంటర్నేషనల్ వంటి స్కాముల గురించి పోలీసులు బయటపెట్టారు.

ఇలాంటివాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పట్టుబడిన ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ప్రకటనలు నమ్మి మోసపోవద్దని, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలంటున్నారు.