పేరుకు మాత్రం వెయిటర్స్.. పక్కా సైబర్ స్కిమ్మర్స్.. జాగ్రత్త సుమా!!

ఏటీఎం కార్డ్ జేబులో ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్లొచ్చు. నగర పౌరులు నెలకోసారైనా స్నేహితులతోనో, కుటుంబసభ్యులతోనో రెస్టారెంట్‌కి వెళుతుంటారు. నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చి కబుర్లు, కాలక్షేపంతో విందారగిస్తారు. అంతా అయిపోయాక వెయిటర్ బిల్ తీసుకువస్తాడు. సోంపు నోట్లో వేసుకుని బిల్ పైన ఏటీఎం కార్డ్ పెట్టిస్తారు.

కూర్చున్నచోటు నుంచి కదలకుండా వెయటర్‌కే పిన్ నెంబర్ కూడా చెబితే అతడే కౌంటర్లో బిల్ పే చేసి కార్డు తెచ్చిస్తాడు. ఈ లోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. డబ్బు డ్రా చేసే మిషన్లలో స్కిమర్లను అమర్చి అకౌంట్‌లో మనీని మూడో కంటికి తెలియకుండా నొక్కేస్తున్నారు. ఇంతకు ముందు ఏటీఎం సెంటర్లలో స్కిమ్మర్లను అమర్చి కార్డ్ డేటాను దొంగిలించేవారు.

తాజాగా క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లలో వెయిటర్లను పెట్టి నయా దందా కొనసాగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విధంగా దోపిడీ చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను బుధవారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఇంకొల్లు సురేంద్రకు చెందిన ఏటీఎం కార్డు నుండి అతడికి తెలియకుండా రెండు సార్లు డబ్బులు డ్రా అయ్యాయి.

అనుమానం వచ్చిన సురేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్కిమ్మింగ్ నేరాలకు పాల్పడుతున్నవారి గుట్టు రట్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అయిదుగురు వ్యక్తులు రెస్టారెంట్లలో వెయిటర్‌లుగా చేరి తమ పనులు ప్రారంభించేవారు. ఒకవేళ పని దొరక్కపోతే ఆయా రెస్టారెంట్లలో పనిచేస్తున్న వెయిటర్స్‌తో పరిచయాలు పెంచుకుని రూ. 2వేలకు స్కిమ్మర్లను అమ్మి డేటా, పిన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో చెప్పేవారు.

కస్టమర్లు కార్డు స్వైప్ చేసినప్పుడు తమ వద్ద ఉన్న స్కిమ్మర్లు, ఎంఎస్‌‌ఆర్ కార్డ్ రీడర్‌తో పిన్ నెంబర్, డేటా దొంగిలించేవారు. ఈ డేటాను క్లోన్ చేసి వారి ముఠాలోని మరో వ్యక్తికి అందించేవారు. ఇలా దొంగిలించిన కార్డ్ డేటాతో నకిలీ కార్డులు తయారు చేసి దేశవ్యాప్తంగా రూ. 50 లక్షలకు పైగా నగదు కొల్లగొట్టారు. ఒక్క హైదరాబాదులోనే రూ. 15 లక్షల వరకు దోచుకున్నారు నకిలీ కార్డుల ద్వారా.

సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపు 30 కేసులు నమోదు కావడంతో నగర పోలీసులు అప్రమత్తమై సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. పోలీసులు ఇలాంటి నేరగాళ్లనుంచి తప్పించుకునేందుకు వీలుగా కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. అవి.. ఏటీఎం కార్డును స్లాట్‌లో పెట్టినప్పుడు నేరుగా పెట్టి తీస్తే దానిపై ఉన్న సమాచారం స్కిమ్మర్ ద్వారా రికార్డు అవుతుంది.

అందుకే కార్డును కొంచెం అటు ఇటుగా కదిలించాలి. ఇక పిన్ ఎంటర్ చేసేటప్పుడు కూడా ప్యాడ్‌పై ఏమైనా పలుచని స్క్రీన్ లాంటివి అమర్చి ఉన్నాయేమో పరిశీలించాలి. పిన్ నెంబర్ నమోదు చేసేటప్పుడు కీ ప్యాడ్‌ను పూర్తిగా మూసివేయాలి. నేరగాళ్లకు ఏటీఎం కార్డు వివరాలు తెలిసినప్పటికీ పిన్ తెలియకపోతే మోసం చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఒకప్పుడు ఇంట్లో దొంగతనం జరిగితేనే డబ్బులు పోయేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి బ్యాంకుల్లో దాచుకున్నా ఏదో విధంగా నగదు చోరీకి గురవుతోంది. తస్మాత్ జాగ్రత్త.