నా ఆట నేనాడతా.. స్వర్ణం కోసం పోటీ పడతా: మేరీకోమ్

ఇంట్లో ఉన్నప్పుడు ఓ సాధారణ మహిళగా ముగ్గురు బిడ్డల ఆలనా పాలనా, భర్త బాగోగులు చూడ్డమే తన పని.. కానీ బాక్సర్‌గా బరిలోకి దిగితే ప్రత్యర్థిని ఎలా ఓడించాలనే దానిపైనే గురి. కొంతకాలం ఆటకు దూరమైనా మళ్లీ మునుపటి ఉత్సాహంతోనే రింగ్‌లోకి అడుగు పెట్టింది.

ప్రత్యర్థిని మట్టికరిపించి ప్రపంచ టోర్నీలో అనూహ్య ప్రదర్శన చేస్తూ ఫైనల్స్‌కి చేరుకుంది. ఇప్పటికే ఐదు పసిడి పతకాలు తన ఖాతాలో వేసుకున్నా ఆరో స్వర్ణం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. బరిలోకి దిగినప్పుడు ఇంకేం ఆడుతుందిలే అని నిరుత్సాహ పరిచిన వారికి సరైన సమాధానమిస్తూ ఫైనల్స్‌కి చేరుకుంది.

మరో వైపు యువ బాక్సర్ లవ్లీనా కాంస్యపతకంతో ఇంటి ముఖం పట్టింది. గురువారం సెమీ ఫైనల్లో మేరీ 5-0 తేడాతో ఉత్తర కొరియా బాక్సర్ కిమ్ హయాంగ్ మినీ ఓడించింది. ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ హనా ఒఖాటాను మేరీకోమ్ ఢీకొంటుంది. ప్రత్యర్థి హనా తన కంటే పొడవుగా బలంగా ఉంటుందని చెప్పింది.

అయితే రింగ్‌లోకి అడుగు పెట్టిన తరువాత ప్రత్యర్థి ఎవరు, ఎలా ఉన్నారు అన్నది పట్టించుకోను. నా ఆట నేనాడతా. ఇంతకు ముందు ఈమెనే పోలెండ్‌లో ఓడించా. ఆమెతో మరోసారి పోటీ పడుతున్నా. విజయం తనని వరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది మేరీ కోమ్.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ ఇప్పటిదాకా ఐదు స్వర్ణాలతో పాటు ఓ రజత పతకం కూడా గెలిచింది. మహిళల బాక్సింగ్‌లో అత్యధిక పతకాలు గెలిచిన ప్రపంచ క్రీడాకారిణుల జాబితాలో ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కేటీ టేలర్ ( 5 స్వర్ణాలు, ఓ కాంస్యం)‌తో మేరీ కోమ్ సమానంగా ఉంది.