11 ఏళ్ల పాప.. సారీ చెబుతూ..

రోజూ రోడ్లపై కొన్ని వందల వాహనాలు ఉరుకులు పరుగులు పెడుతుంటాయి. కారు, బస్సు మధ్యలో కొంచెం ఖాళీ ఉన్నా టూ వీలర్ వెళ్లి దూరి పోతుంది. ఉదయం ఆఫీస్‌కి టైమవుతుందని తొందర కొందరికైతే, సాయింత్రం త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆరాటం. ఇక ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలు సడెన్ బ్రేకులు వేస్తూ ఇతరుల వాహనాల డ్యామేజీకి కారణమవుతుంటాయి.

దాంతో అక్కడ నీదే తప్పంటే.. నీదే తప్పంటూ గొడవ మొదలవుతుంది. మరి కొందరు బాధిత వాహనదారులు బండి దిగేలోపు డ్యామేజ్ చేసిన వ్యక్తి అతడికి దొరక్కుండా పారిపోతుంటారు. అతి కొద్ది మందికి మాత్రమే చేసిన తప్పుకి క్షమాపణ చెప్పే గుణం ఉంటుంది. అలాంటిది తప్పు తనది కాకపోయినా ఆ వ్యక్తి వెళ్లిపోతే వాహనంలో ఉన్న 11 ఏళ్ల చిన్నారి సదరు వాహన దారుడికి వినూత్న పద్దతిలో సారీ చెప్పింది.

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఓ స్కూలు బస్సు.. పాఠశాల ముగిసిన తరువాత చిన్నారులను వారి ఇళ్ళ వద్ద వదిలివేయడానికి బయలు దేరింది. ఈ క్రమంలో ఓ బాలికను ఆమె ఇంటి ముందు దించి బస్సుని వెనక్కి మళ్లిస్తోంది. ఆ సమయంలో అక్కడే పార్క్ చేసి ఉన్న కారుకి స్కూల్ బస్సు తగిలి డ్యామేజ్ అయింది.

అయితే ఆ విషయాన్ని డ్రైవర్ గమనించినా కారుకు సంబంధించిన వ్యక్తులు అక్కడ లేకపోవడంతో బతికిపోయాన్రా దేవుడా అనుకుంటూ ఎంచక్కా వెళ్లిపోయాడు. కానీ బస్సు దిగిన చిన్నారికి మాత్రం తానే ఆ తప్పు చేసినంత బాధపడిపోయింది. వెంటనే స్కూల్ బ్యాగుని కిందికి దించి అందులోని నోట్సులో నుంచి ఓ పేపర్ చించింది.

పెన్ తీసుకుని ఇలా రాసుకొచ్చింది.. మా స్కూలు బస్ డ్రైవర్ పొరపాటున మీ కారుకు తగిలాడు. అందుకు క్షమించమంటూ కారు యజమానిని కోరింది. అందులోనే స్కూల్ బస్ బొమ్మని, బస్సు నెంబర్‌ని కూడా వేసింది. రోజూ సాయింత్రం 5 గంటలకు బస్సు డ్రైవర్ అంకుల్ నన్ను ఇక్కడే దిగబెడతారంటూ పూర్తి సమాచారాన్ని ఆ లేఖలో పొందు పరిచింది.

మరి బస్ అంకుల్‌కి పనిష్మెంట్ ఇస్తారో.. క్షమించి వదిలేస్తారో మీ ఇష్టం అంటూ లేఖ పూర్తి చేసింది. అందమైన దస్తూరితో, అంతకంటే మంచి మనసుతో ఈ పాప రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.