ఆఫర్ల మీద ఆఫర్లు.. దాని వెనుక ఎన్నో మతలబులు

పండగ సీజన్ వచ్చిందంటే ప్రకటనల పర్వం మొదలవుతుంది. పాత రోజుల్లో ఒక టికెట్‌పై రెండు సినిమాలు వేసేవారు. పండగ పుణ్యమా అని కుటుంబ సభ్యులందరూ కలిసి పొలో మని సినిమా హాల్‌కు వెళ్లి పోయేవారు. అదీ సెకండ్ షో. నిద్ర ముంచుకొస్తున్నా ఫ్రీగా వస్తుంది కదా అని బాగానే ఎంజాయ్ చేసేవారు. మరి ఇప్పుడు తుమ్మితే దగ్గితే ఆఫర్లు.

నిజంగానే మనకు అంత తక్కువ ధరకు వస్తున్నాయా అని కొంచెం కూడా ఆలోచించుకోడానికి టైమివ్వరు. ఆలసించిన ఆశాభంగం.. అరగంటలో డీల్ క్లోజ్ అయిపోతుందంటూ మన వీక్‌నెస్ మీద దెబ్బకొట్టేస్తుంటారు. పైగా ఆఫర్లో కొన్న ఫోనో, పెన్నో చూపించి ఎంత కష్టపడితే వచ్చిందో అంటూ అందరికీ చెప్పేస్తుంటారు.

అంతే కాదు ఆన్‌లైన్ రీటెయిలర్లు, ఆఫ్ ‌లైన్ అమ్మకం దారులు ప్రకటించే డీల్స్‌లో కొనుగోళ్లు చేసేందుకు నోకాస్ట్ ఈఎంఐ లేదా జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నామని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తెగ ఊరిస్తుంటాయి. ఈఎంఐతో ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన భారం లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించే వెసులు బాటు కూడా ఉంటుంది.

కానీ నో కాస్ట్ ఈఎంఐ అంటే నిజంగానే దానిపై అదనంగా ఎలాంటి వడ్డీ ఉండదనే అపోహలో ఉంటారు. అసలు జీరో కాస్ట్ ఈఎంఐపై ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో తెలిస్తే కళ్లు తిరుగుతాయి. వాస్తవానికి నో కాస్ట్ ఈఎంఐపై 16నుంచి 24% వరకు అధిక వడ్డీరేటు చెల్లిస్తుంటారు.

సాధారణంగా క్రెడిట్ కార్డులపై చెల్లించాల్సిన మొత్తాలపై జీరో పర్సెంట్ ఈఎంఐ పథకంలో వడ్డీ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీ రూపంలో వసూలు చేసుకుంటాయి. అదే విధంగా కొన్ని బ్యాంకులు రుణంపై వడ్డీని ఆయా ప్రొడక్ట్‌దారుల నుంచి వసూలు చేసుకుంటాయి. ఎందుకంటే అసలు జీరో పర్సెంట్ ఇంట్రస్ట్ అనేదే లేదు.

నో కాస్ట్ ఈఎంఐ అనే పథకం కేవలం వినియోగదారులను ఆకర్షించి, వారిని దోచుకునేందుకేనని డిసెంబర్ 17, 2013లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సర్కులర్‌లో స్పష్టంగా పేర్కొంది. నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్ కేవలం మార్కెటింగ్ మాయాజాలం. రుణంపై వడ్డీని ఏదో ఒక రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు. ఇందులో ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి.

ఒకటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్. ఫుల్ పేమెంట్ చేస్తే మీకు వచ్చే డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ మొత్తాన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలకు ఇస్తాయి. ఇందుకోసం అవి కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.
మరో పద్ధతి వడ్డీ మొత్తాన్ని కూడా ప్రొడక్ట్ ధరలోనే కలిపేయడం.

ఉదాహరణకు వస్తువు ధర రూ.15000 అనుకుంటే మూడు నెలల ఈఎంఐ ప్లాన్‌లో దానిపై 15% వడ్డీ వసూలు చేస్తారు. అలా దానిపై రూ.2,250 వడ్డీ కట్టాల్సి వస్తుంది. మీరు ఎంత వెల చెల్లిస్తారో దానిని రెండు భాగాలు చేస్తారు. ఒక భాగం రీటెయిలర్‌కి మరో భారం వడ్డీ రూపంలో బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థకు వెళ్తుంది. అదే వస్తువు మీరు ఈఎంఐలో కాకుండా ఒకేసారి డబ్బు మొత్తం కట్టి తీసుకుంటే ఆ వస్తువుకి రూ.12,750 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

కానీ ఇలా మూడు నెలలు ఈఎంఐపై వస్తువు కొనడం వలన రూ.2,250 డిస్కౌంట్ తీసేసిన తరువాత వడ్డీ మొత్తం కలిపి చూస్తే మీరు ప్రతి నెలా రూ.5000 చెల్లిస్తున్నట్లు. వడ్డీ మొత్తం ఈఎంఐ నుంచే వసూలు చేస్తారు. చాలా సార్లు ఈ విషయాన్ని మనం గుర్తించలేం. అందువలన ఈ సారి షాపింగ్ చేసేటప్పుడు నో కాస్ట్ ఈఎంఐకి సంబంధించిన అన్ని విషయాలు, షరతులను జాగ్రత్తగా చదివి తెలుసుకోండి. అనవసరపు ప్రకటనలకు మోసపోకండి.