ఆమెకు ఆనాటి నుంచే..

ఆమెకు అందంగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. చెదరని చిరునవ్వే చెలికి ఆభరణం అని తెలిసినా ఆమెకు నగలంటే మోజు. నేటి మహిళకైనా నాటి మహిళకైనా. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. బ్రిటన్‌లో ఈ మధ్య వారు జరిపిన తవ్వకాల్లో ఊహించని దృశ్యం బయటపడింది.

లింకన్ షైర్ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు వారికి 1600 ఏళ్ల నాటి సమాధులు కనిపించాయి. ఈ సమాధుల్లో 20 మంది మహిళల అస్థిపంజరాలు కనుగొనడమే కాకుండా వాటికి ఆభరణాలు కూడా ఉండి వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేసాయి. ఆడవారికి అత్యంత ప్రియమైన నగలతో పాటు, హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయి.

ఇవన్నీ మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. బహుశా ఆరో శతాబ్ధం నాటి ఆంగ్లో- సాక్సన్ జాతివారై ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అలాగే పురుషుల అస్తిపంజరాల వద్ద చిన్న చిన్న ఆయుధాల అవశేషాలు కనిపించాయి. జర్మనీ నుంచి ఓ తెగ బ్రిటీష్ తీర ప్రాంతాలకు వలస వచ్చి ఉండవచ్చునని, ఈ అస్థిపంజరాలు వారివేనని భావిస్తున్నారు. పురాతత్వ వేత్తలు ఈ అవశేషాలకు సంబంధించిన మరికొన్ని పరిశోధనలు జరుపుతున్నారు.