ఘోర అగ్ని ప్రమాదం.. 22 మంది దుర్మరణం

చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని బీజింగ్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంగ్జియా కవు నగరంలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. ఈ దుర్ఘటనలో 22 మంది సజీవదహనమయ్యారు. మరో 22 మందికి పైగా గాయపడ్డారు.

పేలుడు, మంటల ధాటికి ఫ్యాక్టరీకి సమీపంలో నిలిపి ఉంచిన 50 వాహనాలు దగ్ధమయ్యాయి. కంపెనీ సమీపంలో ఉన్న పెద్ద, చిన్న ట్రక్కులు మంటల్లో కాలిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రమాదకరమైన రసాయన పదార్థాన్ని తీసుకొస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగి వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.