మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది. ఈసారి 31 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది. ఈ నెల 29వ తేదీ ఉదయం PSLV-C-43 ఉపగ్రహ వాహక నౌక అంతరిక్షం లోకి దూసుకెళ్లనుంది. ఈ వాహక నౌక ద్వారా మనదేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఉదయం 5 గంటల 57 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన తర్వాత గురు వారం ఉదయం 9 గంటల 57 నిమిషాలకు PSLV-C-43 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్‌ను విశ్వంలోకి చేర్చనున్నారు. అలాగే, 8 దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలున్నాయి. వీటిల్లో 23 శాటిలైట్లు అమెరికాకు చెందినవి కాగా ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేసియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌లకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉంది.

PSLV-C-43 రాకెట్ PSLV సిరీస్‌లో 45వది. ఇందులో ప్రధానమైన హైసిస్ ఉపగ్రహం భూపరిశీలనకు ఉద్దేశించినది. ఈ మిషన్ జీవితకాలం ఐదేళ్లు.