విమానం గాల్లో ఉండగానే నిద్రపోయిన పైలట్

విమానం గాల్లో ఎగురుతుండగానే ఓ పైలట్ నిద్రపోయాడు. కాస్త కునుకు తీసి మళ్ళీ తేరుకొని ప్రశాంతంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. అద‌‌ృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన న‌వంబ‌ర్ 8న జ‌రిగింది. విమానం చేరాల్సిన గమ్యానికి చేరుకోకుండా యాభై కిలోమీటర్లు దూరం ఎక్కువగా ప్రయాణించి ల్యాండ్ అయింది.

దేవన్‌పోర్ట్ నుంచి టాస్మానియాలోని కింగ్ ఐస్‌లాండ్ కు ప్రయాణిస్తున్న విమానాన్ని నడుపుతున్న పైలట్‌కు కాస్త కునుకు పట్టడంతో హాయిగా నిద్రపోయాడు. విమానం కుదుపులకు లోనవడంతో వెంటనే తేరుకొని దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అందులో ప్రయాణిస్తుంది ఆ పైలట్ ఒక్కడే . ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. విమానం ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్‌పోర్ట్‌లో కాకుండా మరో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవడంపై విచారణకు ఆదేశించారు. కింగ్ ఐస్‌లాండ్ నుంచి మరో 46 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించిందని ఆస్ట్రేలియా ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్‌బీ) తెలిపింది.