ప్రేమలోకంలో విహరించారు.. పెళ్లొద్దనేసరికి..

యూనివర్శిటీలో చదువు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రేమ పాఠాలు కూడా వల్లించారు. ప్రేమ జంట పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దలు అందుకు ససేమిరా ఒప్పుకోమన్నారు. దాంతో కలిసి బతకలేకపోయినా కలిసే మరణించాలనుకున్నారు. రైలు పట్టాలకింద పడి తనువు చాలించారు.

తమిళనాడు తిరువళ్లూరుకు చెందిన జీఎస్‌ మౌనీషా, గుమ్మడి పొండికి చెందిన హేమచంద్ర తిరువళ్లూర్ యూనివర్శిటీలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇరువురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వివాహం చేసుకోవాలనుకున్నారు. కలిసి జీవించాలనుకున్నారు.

అదే విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. అయితే హేమచంద్ర కుటుంబీకులు ఈ వివాహానికి అంగీకరించినా, మౌనీషా కుటుంబసభ్యులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో బుధవారం వేకువజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించనందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.