శంకర్, రజనీల మ్యాజిక్.. రోబో 2.0 రివ్యూ

నటీనటులు : రజినీకాంత్ ,అక్షయ్ కుమార్ ,అమీ జాక్సన్ తదితరులు
దర్శకత్వం : యస్ శంకర్
సంగీతం : ఏఅర్ రహమాన్

స్టార్ కాస్ట్ ఎవరయినా శంకర్ సినిమా అనే బ్రాండ్ క్రియేట్ అయ్యింది. రజనీకాంత్ స్టార్ ఇమేజ్ ఆ బ్రాండ్ కి మరింత ఇమేజ్ ని తెచ్చింది. రోబో 2.0 కి ఈ క్రేజ్ కవచంలా కాపాడింది. ఇండియన్ సినిమా కు పెద్ద దిక్కుగా మారిన సౌత్ సినిమా మరో వండర్ ని 2.0 తో అందించింది. మరి శంకర్ , రజనీ ల మ్యాజిక్ తెరమీద ఎలా ఉందో చూద్దాం..

కథ :

చైన్నై లో ఒకరోజు అందరి సెల్ ఫోన్స్ చేతిలో నుండి ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయో తెలియక ప్రజలు, ప్రభుత్వం తలలు పట్టుకుంటారు. సైంటిస్ట్ వశీకరణ్(రజనీకాంత్) ఈ సెల్ ఫోన్స్ మాయం వెనుక ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని కనిపెడతాడు. ఆ నెగిటివ్ ఎనర్జీని అడ్డుకునేందుకు చిట్టీ ఒక్కడే దారి అని ప్రభుత్వానికి చెబుతాడు వశీకరణ్. చిట్టి (రోబో) సహాయంతో వశీ కరణ్ ఆ నెగిటివ్ ఎనర్జీని అడ్డుకున్నాడా..? ఆ నెగిటివ్ ఎనర్జీ ఎవరిది..? పక్షి ఆకారంలో ఎందుకు కనిపిస్తుంది..? అనేది మిగిలిన కథ..?

కథనం:
రోబో తో శంకర్ ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించాడు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచిన ఈ కథ తర్వాత రోబో 2.0 తో శంకర్ ఎలాంటి కథతో ముందుకు వస్తాడు అనే సందేహాలు చాలా ఉన్నాయి. కానీ శంకర్ టెక్నాలజీ తో పాటు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ , రేడియేషన్ వంటి ఇష్యూస్ ని కథకు ముడి సరుకుగా వాడుకున్నాడు.

ప్రతి మనిషికి శరీరంలో భాగం అయిన సెల్ ఫోన్ కి ఆ ఇష్యూస్ ని కనెక్ట్ చేసాడు. ఈ భూమి మనుషులకు మాత్రమే కాదు అనే ట్యాగ్ లైన్ కి వందశాతం న్యాయం చేసే కథను ఎంచుకొని శంకర్ చేసిన భారీ ప్రయత్నం ఆడియన్స్ కి కొత్త అనుభూతులనిచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ తో శంకర్ చేసిన అద్భుతం వెండితెరమీద కన్నుల పండువగా మారింది. పక్షిరాజు పాత్రలో అక్షయ్ కుమార్ నటన చాలా బాగుంది.

కథను మొదలు పెట్టడానికి శంకర్ పెద్దగా టైం తీసుకోలేదు. సినిమాను కథతోనే మొదలు పెట్టాడు. తర్వాత ఆ సమస్యను పెంచుకునే క్రమంలో శంకర్ చూపించిన గ్రిప్పింగ్ కథనం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మర్డర్ పై మర్డర్ చేసే పక్షిరాజు కు చెక్ పెట్టేందుకు చిట్టిని లాంఛ్ చేసే సీన్ చాలా గొప్పగా ఉంది. ఇప్పటి వరకూ హాలీవుడ్‌కే సాధ్యం అని చెప్పుకునే మేకింగ్ ని శంకర్ ఆవిష్కరించాడు.

తన కథను ఎలివేట్ చేసేందుకు శంకర్ చేయించిన ఫీట్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. అమీ జాక్స్ ని ఒక రోబో లా మార్చాడు శంకర్. అందుకు తగ్గట్టుగానే ఆమె నటన సాగింది. ఒక విపత్తు నుండి ప్రజలను కాపాడే క్రమంలో వశీకరణ్ ఎదుర్కొన్న సవాళ్ళు ఆసక్తిగా మారాయి. పక్షిరాజు ను బందీ చేసే సీన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. రజనీ మార్క్ సీన్స్ జోలికి శంకర్ పోలేదు. కథ తోనే రజనీ ఇమేజ్ ని నడిపించాడు.

‘‘ పారిపోవడం అనేది నా మెమరీ’’ లోనే లేదు లాంటి పంచ్ డైలాగ్స్ రజనీ మార్క్ ని లైట్ గా టచ్ చేసాయి. ఇక అనవసరమైన ట్రాక్స్, కాసేపు రిలాక్స్ సీన్స్ మరి కాసేపు లవ్ ట్రాక్ లు అనకుండా తను అనుకున్న కథను నిజాయితీగా ప్రజెంట్ చేసాడు శంకర్. సెకండాఫ్ లో అక్షయ్ కుమార్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో శంకర్ తీసుకున్న కాన్సెప్ట్‌కి ఉండే డెప్త్ అర్ధం అయ్యింది.

వంద గ్రాముల బరువుండే పక్షిని కూడా కాపాడుకులేని టెక్నాలజీ ఎందుకు..? అనే ప్రశ్న నేడు సెల్ ఫోన్ లేకుండా బతకలేని సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ని విలన్ గా చూడలేము. కానీ అతను ఎంచుకున్న దారి అడ్డుకొని ప్రజలను కాపాడేందుకు చిట్టి రీలోడ్ అవుతాడు.

ఆ పాయింట్ నుండి సినిమా ఒక విజువల్ వండర్ గా మారింది. శంకర్‌కి ఉండే విజనరీకి అతని సెన్సిబిలిటీస్ కి హెట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ఎఆర్. రెహామాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శంకర్ విజువల్స్ కి ప్రాణం పోసింది. థింక్ బిగ్ అనే మాటను పదే పదే వాడే శంకర్ ఈ సారి వెండితెరమీద ఒక చిట్టి ని బిగ్ ఇమేజ్ గా మార్చాడు. హాలీవుడ్, సూపర్ మాన్ సరసన చిట్టిని సగర్వంగా నిలబెట్టాడు శంకర్.

చివరిగా:
అత్యుత్తమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రోబో 2.0 ఒక అద్భుతాన్ని వెండితెర పై ఆవిష్కరించాడు. మనిషి నిర్లక్ష్యం కారణంగా ప్రపంచాన్ని నాశనం చేస్తున్న పలు అంశాలను శంకర్ చూపించాడు. అందరినీ ఆకట్టుకోవడమే కాదు ఆలోచనలలో మార్పులు తెచ్చే సినిమా గా 2.0 మిగులుతుంది.