ఆమెకు 22, అతడికి 17.. ఇద్దరూ కలిసి..

నాకంటే అయిదేళ్లు చిన్నోడు.. అయితేనేం నాకు నచ్చాడు.. అందుకే ఏడడుగులు నడిచాను.. మూడు ముళ్లు వేయించుకున్నాను.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఎందుకు లొల్లి చేస్తారంటోంది ఓ వివాహిత.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం ముంబయిలో జరిగింది. ఓ మహిళ తనకంటే అయిదేళ్లు చిన్నవాడైన ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి చెట్టూ పుట్టా తిరిగారు. కలిసి జీవించాలనుకున్నారు. గత ఏడాది నవంబరు 8 న వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ వివాహం అబ్బాయి తల్లి దండ్రులకు అస్సలు ఇష్టం లేదు.

బాలుడు మైనర్ కూడా కావడంతో అబ్బాయిని ట్రాప్ చేసి ప్రేమా, గీమా అంటూ వెంట తిప్పుకుందని, అందుకే పదోతరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. నవంబరు 23 రాత్రి ఆ అమ్మాయి తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి తమ ఇంటికి వచ్చిందని బాలుడి తల్లి పోలీసులకు వివరించింది.

తాము అంగీకరించకపోయేసరికి నోటికి వచ్చినట్లు తిట్టడమే కాకుండా, చంపుతానని కూడా బెదిరించిందని వాపోతున్నారు. ఆమె ఎంత గొడవ చేసినా తాము ఇంట్లోకి రావడాన్ని అంగీకరించకపోవడంతో వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన గంటకే తమ కుమారుడు కూడా వెళ్లిపోయాడని తెలిపింది. వద్దని ఎంత వారించినా తమ బిడ్డ మాట విన్లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయి, విడాకులు తీసుకుని ఇప్పుడు మా అబ్బాయిని పట్టుకుందని అంటున్నారు. ఆమె వలలో పడి కొడుకు తన జీవితాన్ని అన్యాయం చేసుకున్నాడని, భవిష్యత్‌ని పాడు చేసుకున్నాడని అంటున్నారు. తనతో సంబంధాన్ని కొనసాగించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని అంటున్నారు.

ఇలాగే ఒకసారి కిరోసిన్ పోసుకుని, మరోసారి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని దీంతో తన కుమారుడు భయపడి పోయి ఆమె చెప్పినట్లు చేస్తున్నాడని అంటున్నారు. బాలుడి తల్లి ఇలా మాట్లాడుతుంటే.. ఆ అమ్మాయి మాత్రం అతడికి ఇష్టం లేకపోతే మా బంధం ఎలా ముడిపడింది, ఒకరికొకరు ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని అంటోంది.

అలాంటప్పుడు ఇది నేరం ఎందుకవుతుంది అంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తోంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని ఆమెను అరెస్టు చేసి విచారించారు. పోలీసుల విచారణలో ఆమెదే తప్పని తేలడంతో ప్రస్తుతం తన అయిదు నెలల చిన్నారితో ముంబై బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తోంది.