రక్షించమంటూ రోడ్డు మీదికి వస్తే.. అందరూ కలిసి..

ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ రోడ్డు మీదికి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని కాపాడమంటూ చుట్టూ ఉన్న వారిని కోరింది. ఏ ఒక్కరు కూడా ఎవరు చేసింది అని అడిగిన వారు లేరు. పైగా ఆమెనే ఇట్లాంటి డ్రెస్‌లు వేసుకుని రోడ్డు మీదకి వస్తే చెయ్యరా ఏంటి అని కొందరు..

మా అక్క చెల్లెళ్లనైతే ఇలా బయటకు పంపించమని మరి కొందరు.. డ్రగ్స్ ఏమైనా తీసుకున్నావా అని ఒకరు.. నీ ప్రమేయం లేకుండానే అతడు ఆ పని చేశాడా అని ఇంకొకరు.. జరిగిందేదో జరిగిపోయింది. విషయాన్ని అందరికీ తెలిసేలా ఎందుకు ప్రవర్తిస్తావని మరొకరు.. గట్టిగా అరవకు పరువు పోతుంది అంటూ.. ఎవరికి తోచిన విధంగా వారు రకరకాల కామెంట్స్ చేశారు.

అంతే కానీ ఒక్కరూ కూడా ముందుకు వచ్చి నీకు సపోర్ట్‌గా మేముంటాం.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేద్దాం అని అన్న వాళ్లే లేరు. చుట్టూ ఉన్న సమాజం, అందులోని మనుషులు ఓ ఆడపిల్లకు ఇలాంటి సమస్య వస్తే ఎలా ఉంటుంది అనే దానిపై ఓ సామాజిక సంస్థ ఈ వీడియోని రూపొందించింది.

‘షేమ్ ఆన్ హూ?’ అనే పేరుతో రూపొందించిన ఈ వీడియోలో మనాల్ అనే అమ్మాయి అత్యాచార బాధితురాలిగా నటించారు. అయితే చుట్టూ ఉన్నవారంతా నిజమైన వారు. వారికి ఇది ఒక వీడియో షూట్ అని, ఆ అమ్మాయి నటిస్తుందని తెలియదు. ఓ ఆడపడుచుకి అన్యాయం జరిగితే సమాజం ఎలా స్పందిస్తుంది.. ఎవరిని బాధ్యుల్ని చేస్తుంది అనే అంశంపై వీడియోని రూపొందించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది చూశారు. వీడియోని చూస్తూ ఎవరికి వారు తాము కూడా ఇలానే ఆలోచిస్తామా అని ఒక సారి ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు.