సిగరెట్‌తో సొంత ట్రక్కునే కాల్చుకున్నాడు

చాలా మంది సిగరెట్ తాగి దాన్ని ఆర్పకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు. చిన్నముక్కే కదా ఏంచేస్తుందిలే అనుకుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటన సిగరెట్ ముక్క కూడా ఎంతటి ప్రమాదాన్ని స‌ృష్టించగలదో అర్థమవుతుంది. ఓ ట్రక్ డ్రైవర్ తాపీగా సిగరెట్ తాగుతూ ట్రక్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని కాల్చడం పూర్తి అయిన తర్వాత దాని కొనను రోడ్డు మీద పడేయాలనుకున్నాడు. అది కాస్తా అతని ట్రక్‌పైనే పడి కొనకు ఉన్న నిప్పు రవ్వ పెద్ద మంటగా వ్యాప్తి చెంది వాహనాన్ని మెుత్తం కాల్చేసింది. ఈ ఘటన చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్‌లో ఉన్న ఝాంగ్‌జౌలో చోటు చేసుకున్నది.

మంటలు ఆర్పడానికి స్థానికులు ఫైర్ ఇంజన్ సహాయంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రక్‌లోని ప్లాస్టిక్ వస్తువులు, రెండు సైకిళ్ళు పూర్తిగా దగ్ధం అయ్యాయి.అదృష్టం ఏమిటంటే డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. నిర్లక్ష్యం, అలక్ష్యం ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో చెప్పడానికి ఇలాంటి సంఘటనలే ఓ ఉదాహరణ. మన నిర్లక్ష్యం మనల్నే కాల్చేస్తుంది. అంతా అయిపోయాక చేసేదేమీ ఉండదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.