డాక్టర్ వృత్తికే కళంకం.. అదనపు కట్నం కోసం భార్యకి..

పది మందికి ప్రాణం పోసే వృత్తి.. ఆసుపత్రికి వచ్చిన రోగులు డాక్టర్‌నే దేవుడిగా భావిస్తారు. తనలో ఉండాల్సిన మానవత్వాన్ని నిద్రపుచ్చి మృగాన్ని నిద్ర లేపాడు. డాక్టర్‌ని అయినంత మాత్రాన నేనేమి స్పెషల్ కాదు. అందరి లాంటి వ్యక్తినే అని నిరూపించాడు. డాక్టర్ కావడంతో తన తెలివి తేటలు ఉపయోగించి భార్యకు హెచ్‌ఐవీ ఇంజక్షన్ ఇచ్చాడు.

మహారాష్ట్ర పూణే నగరంలోని పింప్రీ చించ్వాద్‌లోని పింపుల్ సౌదాగర్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళకు 2015లో హోమియో డాక్టరుతో వివాహమైంది. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు కట్నకానుకలు ఇచ్చి వివాహం ఘనంగా జరిపించారు. కొద్ది కాలం సంసారం బాగానే సాగింది. అనంతరం అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు.

అప్పటికీ ఆమె ఒకసారి పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి భర్త చేతికి ఇచ్చింది. అయినా ఇంకా డబ్బు కావాలని అడగడంతో ఎదురు తిరగడం మొదలు పెట్టింది. దీంతో భార్యని విడాకులు ఇవ్వమని వేధించడం ప్రారంభించాడు. దానికి ఆమె ససేమిరా అనడంతో డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే పని చేశాడు. భార్యకు బలవంతంగా హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇచ్చాడు.

వద్దని ఎంత ప్రాధేయ పడ్డా వినలేదు. దీంతో భర్తపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆమెను వైద్యుల వద్దకు పంపి ఆమె ఇచ్చిన ఫిర్యాదులో నిజా నిజాలు నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ భర్తని అరెస్టు చేసి విచారిస్తున్నారు.