పసుపుతో పలు ప్రయోజనాలు.. ఒబేసిటీకి.. పసుపు టీ..

చిటికెడు పసుపు వేస్తేనే కూరకి రంగుతో పాటు రుచీ వస్తుంది. సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌గా పసుపు పనిచేస్తుంది. పసుపులో లభించే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీ ఇన్‌ప్లేమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే గుణాలున్నాయి. పసుపు టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

బరువు తగ్గించడంతో పాటు, ఒబెసిటీతో బాధపడేవారికి పసుపు టీ చక్కని పరిష్కారం. గుండె ఆరోగ్యంగా ఉండడానికి పసుపు టీ దోహదం చేస్తుంది. కేన్సర్‌తో పోరాడే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. కేన్సర్‌కి సంబంధించిన ట్యూమర్ల పెరుగుదలను, కేన్సర్ కణాల విస్తరణను కుర్కమిన్ అడ్డుకుంటుందని పరిశోధనలో వెల్లడైంది. డయాబెటిస్‌ను అడ్డుకోవడంలోనూ పసుపు సహాయపడుతుంది. కీళ్ల నొప్పుల తీవ్రతను తగ్గిస్తుంది.

పసుపు టీ తయారీకి 3 కప్పుల నీటిని వేడి చేసి అందులో 1 స్పూన్ పసుపు పొడిని కలపాలి. పది నిమిషాలు ఈ నీటిని మరిగించాలి. తరువాత దానిని 5 నిమిషాలపాటు చల్లార్చాలి. దీనికి ఓ చిన్న అల్లం ముక్క, కొంచెం తేనె కలిపి గోరు వెచ్చగా తాగాలి. ఇలా ప్రతి రోజు తాగడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది.

శరీర లావణ్యాన్ని మెరుగు పరచుకోవడానికి కూడా పసుపు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు స్వచ్ఛమైన పసుపుని, పాలతో కలిపి ఒంటికి పట్టించి తరువాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా పెరుగుతుంది.

ఎక్కువ సేపు నీటిలో నానిన పాదాలు పగిలి ఇబ్బందికి గురిచేస్తుంటాయి. అలాంటప్పుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పని చేసి పగుళ్లు నివారింపబడతాయి. పసుపు నీటిని వారానికి ఒకసారి తాగడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.

వారానికి ఒకసారి ఒక స్పూన్ పసుపు పొడి తీసుకుని అందులో కొద్దిగా ఆముదం కలిపి శరీరానికి పట్టించాలి. ఇలా చేయడం వలన శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవాధుల వంటివి తగ్గిపోతాయి. పసువు, వేపాకు కలిపి నూరిన ముద్దను శరీరానికి పూసుకుంటే కూడా దురదలు తగ్గుముఖం పడతాయి.