వాష్‌రూమ్‌లోకి మొబైల్.. కోరి జబ్బుల్ని..

ఒక్క నిమిషం కూడా ఫోన్ వదిలి ఉండలేని పరిస్థితి. గుడ్ మార్నింగ్ నుంచి మొదలు గుడ్ నైట్ వరకు ఫోన్‌కి రెస్టు లేదు. అర్జంట్‌గా వాష్ రూంకి వెళ్లాలి. అంతలోనే ఫోన్ రింగవుతుంది. వెళ్లొచ్చాక అయినా మాట్లాడొచ్చు. కానీ అలా చేయకుండా టైమ్ లేనట్లు అందుల్లో క్కూడా పట్టుకెళ్లి అంతర్జాతీయ విషయాలేవో ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు.

అయితే ఇలా ఫోన్‌ని టాయ్‌లెట్లోకి తీసుకెళ్లకండి మహాప్రభో అంటున్నారు ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్‌’ కు చెందిన పరిశోధకులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి అంటే మీ చేతిలోని సెల్‌ని వాష్‌రూమ్ బయటే వదిలేయండి అంటున్నారు. అసలే అపురూపంగా చూసుకునే స్మార్ట్‌ఫోన్.. మరి దాని మీద టాయిలెట్ సీట్ కంటే 7 రెట్లు మురికి అధికంగా ఉంటుందంటే నమ్మగలమా.. ఇక లెదర్ కేసింగ్‌లో ఉండే స్మార్ట్‌ఫోన్లలో అయితే బ్యాక్టీరియా మరింత ఎక్కువగా ఉంటుందట.

దీని మీద 17 రెట్లు ఎక్కువ మురికి ఉంటుంది అని రీసెర్చి తేల్చి చెప్పింది. ఇలా ఉన్న ఫోన్‌ని బాత్‌రూంలోకి తీసుకెళితే ఈ-కోలి లాంటి కొన్ని హానికారక క్రిములు పేరుకుని ఫోన్ మొత్తం కలుషితం అవుతుందట. ఇక దాన్ని తీసుకుని అందుల్లోకి కూడా వెళ్లిపోతే మరిన్ని జబ్బులు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు.

ఆఫీసుల్లో పనిచేసే ప్రతి ఐదుగురిలో కనీసం ఇద్దరికి బాత్రూముల్లో బాతాఖానీ నడిపే అలవాటు ఉందని తేలిందట. పైగా అపురూపంగా చూసుకునే అస్సలు శుభ్రపరచని వస్తువేదైనా ఉందంటే అది స్మార్ట్‌ఫోన్ అని అంటున్నారు. అందుకే ఇకపై ఊర్లో ఉన్న మీ చిన్నారులకు ముద్దు పెట్టాలంటే ఫోన్‌కి పెట్టకండి.. ప్లయింగ్ కిస్స్ ఇచ్చేయండి. లేదంటే మీ ఫోన్‌ మీద ఉన్న బ్యాక్టీరియా మీ.. జాగ్రత్త సుమా..!!