సీన్ రివర్స్.. క్యాబ్ డ్రైవర్‌ని దోచుకుని.. అతడి భార్యతో..

ఊరి చివరి నుంచైనా, అర్థరాత్రి అపరాత్రైనా క్యాబ్ డ్రైవర్‌కి కాల్ చేస్తే చాలు నిమిషాల్లో కారు వచ్చి కళ్ల ముందు ఆగుతుంది. చేతిలో ఫోన్ ఉంటే చాలు. చేరవలసిన గమ్యస్థానానికి చేరుస్తారు క్యాబ్ డ్రైవర్లు. దాదాపుగా క్యాబ్ డ్రైవర్లు మర్యాదగానే ప్రవర్తిస్తారు ప్రయాణీకులతో. కొంతమంది మాత్రం ఒంటరి ఆడవాళ్లని వేధిస్తూ క్యాబ్ డ్రైవర్లపై అనుమానాలు రేకెత్తిస్తుంటారు.

ముఖ్యంగా ఐటీ కంపెనీ కారిడార్‌గా పేరున్న బెంగళూరులో క్యాబ్‌డ్రైవర్ల వేధింపులు ఎక్కువగా ఉంటాయి. తాజాగా జరిగిన ఓ ఘటనలో సీన్ రివర్స్ అయింది. ఎప్పుడూ ప్రయాణీకులు క్యాబ్ డ్రైవర్లనుంచి వేధింపులకు గురవుతుంటే, ఈసారి నలుగురు ప్రయాణీకులు క్యాబ్ డ్రైవర్‌ని వేధించారు. శుక్రవారం రాత్రి సోమశేఖర్ అనే ఓలా క్యాబ్ డ్రైవర్‌కు అడుగోడి దొమ్మసంద్రకు యాప్ ద్వారా బుకింగ్ వచ్చింది.

రాత్రి 10.30 గంటలకు నలుగురు ప్రయాణీకులు క్యాబ్‌లోకి ఎక్కి కూర్చున్నారు. మీరు దిగవలసిన ఏరియా వచ్చిందని డ్రైవర్ ప్రయాణీకులతో చెప్పాడు. కానీ వారు దిగకుండా డ్రైవర్ దగ్గరనుంచి కార్ కీస్ తీసుకుని 100 కి.మీ వేగంతో కారుని నడిపించారు. డ్రైవర్‌ని బెదిరించి అతడి ఖాతాలో ఉన్న రూ.9వేలను వారి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.

ఇంకా డబ్బు కావాలని బెదిరించడంతో పేటీఎం ద్వారా మరో రూ.20 వేలు ఇచ్చాడు. అంతటితో ఆగక క్యాబ్ డ్రైవర్ భార్యకు వీడియో కాల్ చేశారు. దుస్తులు విప్పేయమని బెదిరించి.. ఆమె నగ్న దృశ్యాలను స్క్రీన్ ‌షాట్స్ తీశారు. ఆ తరువాత అతడి ఫోన్‌ని కూడా లాగేసుకుని వదిలిపెట్టారు. ‌

బాధితుడు పోలీసులను ఆశ్రయించి విషయం మొత్తం వివరించాడు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నలుగురి ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు.