టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ.. భట్టి ఆందోళన

ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బుల పంపిణీ చేస్తున్నారంటూ.. భట్టి విక్రమార్క ఆందోళనకు దిగారు. దీనికి పోటీగా అటు టీఆర్‌ఎస్‌ నేతలు సైతం.. నిరసనలు చేశారు. దీంతో ముదిగొండలో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది..

మధిర నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. డబ్బుల పంపణీ వివాదం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గొడవకు దారితీసింది. ముదిగొండలో టీఆర్ఎస్ కు చెందిన వ్యక్తులు డిజిటల్ కరెన్సీ పంపించేందుకు ప్రయత్నించారన్నది భట్టి వర్గం ఆరోపణ. ఓటర్ల ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలను తీసుకుంటున్నారని అంటున్నారు. అకౌంట్ వివరాలు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామంటున్నారు.

ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలను ముదిగొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు భట్టి విక్రమార్క అనుచరులు. ఇదే సమయంలో… అటు టీఆర్ఎస్ నేతలు సైతం పెద్దసంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం రణరంగంగా మారింది.

టీఆర్ఎస్ నేతలపై చర్య తీసుకోవాలంటూ మధిర కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు బట్టి విక్రమార్క్ ముదిగొండ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఓటర్ల బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించారంటూ ఫైర్‌ అయ్యారు భట్టి.

కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఓటమి భయంతోనే భట్టి విక్రమార్క కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రెండు పార్టీల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు.. పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు.