శబరిమలలో 10 లక్షల మంది మహిళలతో..

sabarimala

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం కేరళ ప్రభుత్వం కృషి చేస్తోంది. తీర్పు అమలు కోసం మద్దతు కూడగడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రభుత్వం ‘ఉమెన్‌ వాల్‌’ పేరుతో మహార్యాలీ నిర్వహించనున్నారు.. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సుమారు పదిలక్షల మంది మహిళలతో ఈ ఉమెన్స్‌‌ వాల్‌ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

కేరళలోని ఉత్తరాది జిల్లా అయిన కాసర్గోడే నుంచి రాష్ట్ర రాజధాని తిరువనంతపురం వరకు పదిలక్షలమంది మహిళలతో ఉమెన్స్‌‌ వాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమవంతు మద్దతిస్తామని కొన్ని సంస్థలు ప్రభుత్వానికి మాటిచ్చాయని, ఇది శుభపరిణామమని సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా తమతమ మహిళా కార్యకర్తలను ఈ కార్యక్రమానికి పంపవచ్చని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో 150 గ్రూపులకు సమాచారాన్ని పంపించారు.

ఈ కార్యక్రమానికి మద్దతివ్వాలంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ కూడా ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చారు. ‘ ప్రజలను మూఢనమ్మకాల నుంచి కాపాడటానికి, స్త్రీలను సమానత్వం దృష్టితో చూడటానికి ‘మిలియన్‌ ఉమెన్స్‌‌ వాల్’ను ఏర్పాటు చేస్తున్నాం. ఆంగ్ల సంవత్సరాది నాడు ఇందుకు శ్రీకారం చుట్టాం. 600కి.మీమేర ఈ వాల్‌ను ఏర్పాటు చేస్తాం. రండి..మీ వంతు మద్దతివ్వండి. అప్పుడది చాలా చాలా హ్యాపీ సంవత్సరమవుతుంది’ అని ట్వీట్‌ చేశారు.