అమ్మా అనసూయా.. సావిత్రికే అసూయ కలిగేలా.. : నెటిజన్స్ కామెంట్స్

అందం, అభినయం కలబోసిన నటి.. మహానటి సావిత్రి. మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడి పాత్ర పోషించి నూటికి నూటయాభై మార్కులు కొట్టేసింది. ఎన్ని దశాబ్ధాలు గడిచినా ఆ చిత్రం ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. అందులోని అహా నా పెళ్లంట పాటకు సావిత్రి చేసిన అభినయానికి ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు ఎప్పటికీ నీరాజనాలు పడుతుంటారు.

ఆ పాత్రలో ఆమెను తప్పించి మరెవర్నీ ఊహించుకోలేము. అంతగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది సావిత్రి. మరలాంటిది ఆ పాత్ర అనసూయను వరిస్తే.. ఇంతకీ ఆ సినిమాను రీమేక్ చేస్తున్నారా ఏంటి.. ప్రేక్షకుల గుండెల్లో గుబులు. అయ్యో స్వర్గంలో ఉన్న సావిత్రి ఎంత బాధపడుతుంది. ఒకే ఒకే.. అను ముచ్చటపడుతుందేమో అని ఆశీర్వదించేస్తుందేమో.. నిజమే ఓ యాడ్ చేయమంటూ చందనా బ్రదర్స్ వారు అనుని సంప్రదించారు.

అది అహ నా పెళ్లంట థీమ్‌తో రూపొందించిన ప్రకటన. దానికి అనసూయ సావిత్రిలా అభినయిస్తూ, హావభావాలు పలికిస్తూ తన శక్తి మేరకు న్యాయం చేసింది. అది చూసి నెటిజన్స్ తలా ఒకరకంగా స్పందిస్తున్నారు. అనసూయ మాత్రం ఈ యాడ్‌లో నటించడం నిజంగా నా అదృష్టం.. ఈ అవకాశం నన్ను వరిస్తుందని అస్సలు ఊహించలేదు అని బోలెడంత సంతోషపడిపోతోంది.

టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్.. చాలా బాగా నటించారు అంటూ అనూపై ప్రశంసలు కురిపించారు. కొంతమంది అభిమానులు సరదాగా ట్రోలింగ్ చేస్తున్నారు. అనసూయను ఎవరూ ఇలా ఊహించుకోలేదు. అందుకే కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది చిరంజీవి జిఫ్ ఇమేజ్ పెట్టి ట్రోల్ చేస్తే, మరికొంత మంది బాలయ్య ఇమేజ్‌తో కేక పెట్టిస్తున్నారు. మొత్తానికి నెటిజన్స్ కామెంట్స్ కాసేపు నవ్వుకోడానికి బావున్నాయి.