వాల్‌స్ట్రీట్‌.. రెండో రోజూ రిలీఫ్‌ ర్యాలీ

stock market updates

అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌, చైనా చీఫ్‌ జిన్‌పింగ్‌ మధ్య సమావేశంపై అంచనాలతో శుక్రవారం జోరందుకున్న యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం సైతం లాభాలతో పురోగమించాయి. డోజోన్స్‌ 288 పాయింట్లు(1.15 శాతం) పెరిగి 25,826 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(1.1 శాతం) పుంజుకుని 2790 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 111 పాయింట్లు(1.5 శాతం) జంప్‌చేసి 7330 వద్ద స్థిరపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్యలు మొదలుకావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో సోమవారం ఆసియా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సైతం 2.5-1 శాతం మధ్య ఎగసిన సంగతి తెలిసిందే.

Image result for boeing and caterpillar

యాపిల్‌ జోరు
ఇటీవల నేలచూపులతో కదులుతున్న ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ 3.5 శాతం జంప్‌చేసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలకు చెక్‌పడనున్న అంచనాలు ఇందుకు సహకరించగా.. టెక్నాలజీ ఇండెక్స్‌ 2 శాతం పుంజుకుంది. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్‌ దాదాపు 4 శాతం లాభపడగా.. కేటర్‌పిల్లర్‌ 2.5 శాతం ఎగసింది. మరోపక్క చమురు ధరలు బలపడటంతో ఎనర్జీ, ఇండస్ట్రియల్స్‌ సైతం బలపడ్డాయి. కేన్సర్‌ స్పెషలిస్ట్‌ సంస్థ టెసారోను 5 బిలియన్‌ డాలర్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేసేందుకు గ్లాక్సో స్మిత్‌క్లెయిన్‌ బోర్డు ఓకే చెప్పింది. దీంతో టెసారో 59 శాతం దూసుకెళ్లింది.ట్రిబ్యూన్‌ మీడియాను 4 బిలియన్‌ డాలర్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేయనున్నట్లు నెక్స్‌స్టార్‌ మీడియా గ్రూప్‌ పేర్కొంది. దీంతో ట్రిబ్యూన్‌ మీడియా 12 శాతం, నెక్స్‌స్టార్‌ 7 శాతం చొప్పున జంప్‌చేశాయి.