ముందస్తు వ్యూహంతోనే హింస..!

యూపీలోని బులంద్‌షహర్‌ అల్లర్ల వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉందని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ వ్యక్తులే ఈ అల్లర్లకు కుట్ర జరిపారన్నారు సుబ్రహ్మణ్యస్వామి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షెహ‌ర్‌లో గోవధ జరిగినట్లుగా వచ్చిన వార్తలు ఓ వ్యక్తి మృతికి దారి తీశాయి. బులంద్‌షహర్‌లో గోవధ జరిగినట్లు వార్తలు వెలువడడంతో స్థానిక ప్రజలు భారీ ప్రదర్శన చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగి ఆ వెంటనే హింస చెలరేగడంతో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సుబోద్ కుమార్ సింగ్ మృతి చెందాడు. సుబోద్ కుమార్ సింగ్‌ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతోనే ఆయన మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు తెలిపారు.

అయితే ఇక్కడ ముందస్తు వ్యూహంతోనే హింస చెలరేగేలా చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈకేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి బులందర్ షెహర్ కోర్టులో హాజరు పరిచారు. వారికి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.