ముక్కోటి దేవతలు బంధుమిత్రులై తరలివచ్చే కమనీయ వేడుక

ముక్కంటికి అత్యంత ప్రీతికరమైన మాసం… కార్తీక మాసం. పరమ శివుడు జ్యోతి రూపంగా పూజలందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ఈశ్వరుడిని ఆరాధించినా, అర్చించినా, దర్శించినా, ఆదిదంపతుల కళ్యాణాన్ని తిలకించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటాయి పురాణాలు. అందుకే విశ్వమానవ కళ్యాణం కోసం టీవీ5, హిందూధర్మం ఛానెళ్ళు ప్రతీయేటా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాయి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ భాగ్యం ఈసారి కర్నూలు నగరానికి దక్కింది.

దేవుళ్లకు పెళ్లిళ్లు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.. ఆ సంప్రదాయాన్ని టీవీ5, హిందూధర్మం ఛానెళ్ళు కొనసాగిస్తున్నాయి. పవిత్ర కార్తిక మాసంలో మాస శివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం నిర్వహిస్తున్నాయి. లక్షలాది మంది భక్తుల సమక్షంలో వేడుకను రమణీయంగా చేపడుతున్నాయి. ఈసారి కళ్యాణ వేడుక భాగ్యం కలగడంతో కర్నూలు నగరం పరవశించిపోతోంది.

టీవీ5 నెట్‌వర్క్‌ ఈ పవిత్ర కార్యానికి 2013లో శ్రీకారం చుట్టింది. తొలిసారి హైదరాబాద్‌లో రమణీయంగా జరిగిన ఆదిదంపతుల కళ్యాణం ఆ తర్వాత నుంచి తెలుగునేలపై ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. 2013 డిసెంబర్ 2న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివయ్య పెళ్లితో పులకించిపోయింది

రెండోసారి 2014 నవంబర్ 20న జరిగిన శివపార్వతుల కళ్యాణానికి కూడా ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసమైంది. ఆది దంపతుల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలివచ్చి కనులారా తిలకించి తరించారు. ప్రత్యక్షంగా ఈశ్వరుడి పెళ్లి వేడుక చూసినంత ఆనంద పరవశులయ్యారు

పరమశివుడు అందరి దేవుడు. అందుకే కళ్యాణ వేడుకను ఒక్క హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో నిర్వహిస్తూ వస్తోంది. 2015 డిసెంబర్ 9న నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు శివపార్వతుల కళ్యాణానికి వేదికైంది. దేవతల పెళ్లి వేడుక చూసి నవ్యాంధ్ర పులకించిపోయింది.

నాలుగోసారి శివపార్వతుల కళ్యాణ వేదికను వేదంలా ఘోషించే గోదారి ఒడ్డున రాజమహేంద్రవరంలో నిర్వహించాయి టీవీ5, హిందూధర్మం ఛానెళ్లు. 2016 నవంబర్ 27న ఆకాశమంత పందిరివేసి ఈ కళ్యాణ వేడుకను కమనీయంగా జరిపించాయి..

2017 నవంబర్ 16న చారిత్రక నగరం ఓరుగల్లు శివనామస్మరణతో మార్మోగింది. కాకతీయుల ఏలికలో పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనించిన ప్రాంతం ఈ సారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి వేదికైంది.

సాక్షాత్తు ఆ బ్రహ్మ దేవుడే పురోహితుడై.. నారాయణుడే కన్యాదాతగా మారి పంచ భూతాలు, అష్టదిక్పాలకులు, దేవతలంతా ఆశీర్వచన జల్లులు కురిపిస్తుండగా, ఆ కైలాసాన పార్వతీదేవిని పరమశివుడు పరిణయమాడే సందర్భం ఎన్నో పురాణాలు కళ్లకు కడుతున్నాయి. కానీ, ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగితే నిజంగా జన్మ ధన్యమైనట్టే. ఆ బృహత్‌ కార్యాన్ని టీవీ-5, హిందూధర్మం ఛానెళ్ళు స్వీకరించాయి. భక్తులకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మహా ఘట్టానికి శ్రీకారం చుట్టాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పంతో ఈ బృహత్కార్యాన్ని చేపడుతున్నాయి.

ఈసారి కూడా కళ్యాణం రమణీయంగా నిర్వహించేందుకు యావత్ ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతోంది టీవీ5 నెట్ వర్క్. ఇప్పటికే యావత్ కర్నూలు నగరం స్వాగత తోరణాలతో నిండిపోయింది. పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తలు ఈ మహాకార్యక్రమానికి తరలిరానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో శివపార్వతుల కళ్యాణోత్సవం ఆద్యంతం ఆసక్తిగా మారనుంది. స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కళ్యాణానికి ముందు ఆదిదంపతుల శోభాయాత్ర జరగనుంది. తుంగభద్రా తీరం నుంచి రంగరంగ వైభవంగా మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ కర్నూలు పురవీధుల గుండా సుమనోహరంగా చిద్విలాసంతో కల్యాణ వేదికకు చేరుకుంటారు. విశ్వకళ్యాణాన్ని కాంక్షిస్తూ చేసే ఆదిదంపతుల కళ్యాణం కోసం కర్నూలులో పెళ్ళి కళ వచ్చేసింది. రండి… తరలిరండి… శివపార్వతుల కల్యాణాన్ని కనులారా వీక్షించి లోకకల్యాణంలో భాగస్వాములుకండి.