ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి ముస్తాబైన కర్నూలు

శివపార్వతుల కళ్యాణోత్సవానికి కర్నూలు ముస్తాబైంది. నగరం స్వాగత తోరణాలతో నిండిపోయింది. మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు ముగింపు దశకు చేరాయి. ఆది దంపతుల కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించేందుకు కర్నూలు వాసులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం కళ్యాణ క్రతువు మొదలుకానుంది.

ఈసారి కూడా కళ్యాణం రమణీయంగా నిర్వహించేందుకు యావత్ ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతోంది టీవీ5 నెట్ వర్క్. ఇప్పటికే యావత్ కర్నూలు నగరం స్వాగత తోరణాలతో నిండిపోయింది. పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తలు ఈ మహాకార్యక్రమానికి తరలిరానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో శివపార్వతుల కళ్యాణోత్సవం ఆద్యంతం ఆసక్తిగా మారనుంది. స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కళ్యాణానికి ముందు ఆదిదంపతుల శోభాయాత్ర జరగనుంది. తుంగభద్రా తీరం నుంచి రంగరంగ వైభవంగా మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ కర్నూలు పురవీధుల గుండా సుమనోహరంగా చిద్విలాసంతో కల్యాణ వేదికకు చేరుకుంటారు. విశ్వకళ్యాణాన్ని కాంక్షిస్తూ చేసే ఆదిదంపతుల కళ్యాణం కోసం కర్నూలులో పెళ్ళి కళ వచ్చేసింది. రండి… తరలిరండి… శివపార్వతుల కల్యాణాన్ని కనులారా వీక్షించి లోకకల్యాణంలో భాగస్వాములుకండి.