శివపార్వతుల కల్యాణాన్ని కనులారా తిలకించండి

sivaparvathula kalyanam in kurnool

ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం… కార్తీకం. పరమ శివుడు జ్యోతి రూపంగా పూజలందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ముక్కంటిని ఆరాధించినా, అర్చించినా, దర్శించినా, ఆదిదంపతుల కళ్యాణోత్సవం తిలకించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే విశ్వమానవ కళ్యాణం కోసం టీవీ5, హిందూధర్మం ఛానళ్ళు ప్రతీయేటా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాయి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం జరిపించే భాగ్యం ఈసారి కర్నూలు నగరానికి దక్కింది. కొండారెడ్డి బురుజు సాక్షిగా.. మెడికల్ కాలేజ్ గ్రౌండ్‌లో ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది.

శివపార్వతుల కళ్యాణోత్సవానికి టీవీ5 నెట్‌వర్క్‌ 2013లో శ్రీకారం చుట్టింది. తొలిసారి హైదరాబాద్‌లో రమణీయంగా జరిగిన ఆదిదంపతుల కళ్యాణం ఆ తర్వాత నుంచి తెలుగునేలపై ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. 2013 డిసెంబర్ 2న హైదరాబాద్‌లోని NTR స్టేడియం శివయ్య పెళ్లితో పులకించిపోయింది. రెండోసారి 2014 నవంబర్ 20న జరిగిన శివపార్వతుల కళ్యాణానికి కూడా ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసమైంది. ఆది దంపతుల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలివచ్చి కనులారా తిలకించి తరించారు. ప్రత్యక్షంగా ఈశ్వరుడి పెళ్లి వేడుక చూసినంత ఆనంద పరవశులయ్యారు. 2015 డిసెంబర్ 9న నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు శివపార్వతుల కళ్యాణోత్సవానికి వేదికైంది. దేవతల పెళ్లి వేడుక చూసి నవ్యాంధ్ర పులకించిపోయింది. నాలుగోసారి శివపార్వతుల కళ్యాణ వేదికను వేదంలా ఘోషించే గోదారి ఒడ్డున రాజమహేంద్రవరంలో నిర్వహించాయి టీవీ5, హిందూధర్మం ఛానళ్లు. 2016 నవంబర్ 27న ఆకాశమంత పందిరివేసి ఈ కళ్యాణ వేడుకను కమనీయంగా జరిపించాయి. 2017 నవంబర్ 16న చారిత్రక నగరం ఓరుగల్లు శివనామస్మరణతో మార్మోగింది. కాకతీయుల ఏలికలో పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనించిన ప్రాంతం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి వేదికైంది. ఇప్పుడు రాయలసీమలో జరగబోతోంది. చారిత్రక కర్నూలు నగరం ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి ముస్తాబైంది.

కర్నూలులో శివపార్వతుల కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించేందుకు యావత్ ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతోంది టీవీ5 నెట్‌వర్క్. కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు.. కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపించేందుకు.. తమ ప్రవచనాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేందుకు.. పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తలు ఈ మహాకార్యానికి వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో శివపార్వతుల కళ్యాణోత్సవం ఆద్యంతం ఆసక్తిగా సాగనుంది.

ఆదిదంపతుల కళ్యాణానికి ముందు సిటీలో శోభాయాత్ర జరగనుంది. తుంగభద్ర తీరం నుంచి మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ కర్నూలు పురవీధుల గుండా సుమనోహరంగా చిద్విలాసంతో కల్యాణ వేదికకు చేరుకుంటారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పించిన ఈ వేడుక కోసం సర్వం సిద్ధమైంది. కర్నూలు మెడికల్ కాలేజ్ మైదానం సుందరంగా ముస్తాబైంది.  సకుటుంబ సపరివార సమేతంగా ఈ మహోత్సవంలో పాల్గొనాలని భక్తకోటికి టీవీ5, హిందూధర్మం ఛానళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. ”రండి… తరలిరండి… శివపార్వతుల కల్యాణాన్ని కనులారా తిలకించి లోకకల్యాణంలో భాగస్వాములు కండి” అంటూ టీవీ5 పిలుస్తోంది.