కింగ్ ఫిషర్ మాల్యా ట్వీట్.. చేసిన అప్పంతా..

చేసిన తప్పు తెలిసింది.. అప్పు మొత్తం తీర్చేస్తా. తీసుకోండి ప్లీజ్ అని కింగ్ ఫిషర్ మాల్యా భారతీయ బ్యాంకులను ప్రాధేయపడుతున్నారు. కోట్లరూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న మాల్యాకు తాను చేసిన తప్పేంటో ఇప్పటికి తెలిసినట్టుంది. నయా పైసాతో సహా తిరిగి ఇచ్చేస్తానంటున్నారు.

తనను రుణాల ఎగవేతదారుగా కొందరు రాజకీయ నాయకులు, మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని.. అయితే తాను రుణం మొత్తం చెల్లించేందుకు 2016లోనే ప్రతిపాదన చేశానని గుర్తు చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మాల్యా స్పష్టం చేశారు. లండన్‌లో తల దాచుకుంటున్న మాల్యాను అప్పగించమని భారత్ యూకేని కోరింది.

మరో అయిదు రోజుల్లో యూకే కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో మాల్యా రుణం మొత్తం చెల్లిస్తానంటూ ట్వీట్ చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. దేశంలోనే అతి పెద్ద ఆల్కహాలిక్ బేవరేజ్ గ్రూప్‌గా ఉన్న కింగ్ ఫిషర్ పన్నుల రూపంలో వేలాది కోట్ల రూపాయలను చెల్లించింది.

అయినప్పటికీ ఒకానొక దశలో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ బ్యాంకులకు ఎలాంటి నష్టం కలగకుండా మొత్తం రుణం చెల్లిస్తాను. దయచేసి తీసుకోండి అంటూ మాల్యా ట్వీట్ చేశారు.