టీడీపీతో రాజకీయవైరాన్ని ప్రధాని వ్యక్తిగతంగా తీసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, PMO ఆడుతున్నవన్నీ డ్రామాలేనని మరోసారి తేలిపోయింది. సాక్షాత్తూ నీతిఆయోగే ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండంటూ.. అధికారుల్ని ఆదేశించింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఫిబ్రవరిలో 350 కోట్లు ఇచ్చి.. ఆ వెంటనే వెనక్కి తీసేసుకుంది కేంద్రం. ఈ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఫిర్యాదులు చేయడంతో అన్ని అంశాలను పరిశీలించిన నీతిఆయోగ్ టీమ్.. చివరకు నిధులపై ఆర్థిక శాఖకు లేఖ రాసింది. విభజన చట్టం అమలుపై సమీక్షించేందుకు నీతి ఆయోగ్‌ సభ్యులు వారం కిందట అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా తాము కేంద్రానికి సమర్పించిన యూసీల వివరాల్ని అధికారులు వివరించారు. రావాల్సిన 350 కోట్లు త్వరగా విడుదలఅయ్యేలా చూడాలని కోరారు. దీనిపై పూర్తి వివరాలు తీసుకున్న నీతిఆయోగ్ బృందం.. పెండింగ్ నిధులతోపాటు కొత్తగా ఇవ్వాల్సిన 350 కోట్లు కూడా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే.. పెండింగ్‌లో ఉన్న మరో 926 కోట్లకు సంబంధించిన యూసీలను కూడా కేంద్రానికి ఇచ్చిన నేపథ్యంలో.. నిధుల విడుదలపై ఎలాంటి నిర్ణయం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన యూసీలు నిర్దేశిత ఫార్మాట్‌లోనే ఉన్నాయని, 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 350 కోట్లు విడుదల చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. వాస్తవానికి 2018 ఫిబ్రవరి 2నే కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌కు లేఖ రాసినా నిధులు విడుదల కాలేదు. తాజాగా రాష్ట్రం మరోసారి దీనిపై లెటర్ రాయడంతో మరోసారి ఆర్థిక శాఖకు దీన్ని క్లియర్ చేయాలంటూ సూచించింది. ఐతే.. నీతిఆయోగ్‌కు ఛైర్మన్‌గా ఉన్న ప్రధాని.. ఏపీకి నిధులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది త్వరలోనే తేలబోతోంది.

విభజన చట్టంలో పేర్కొన్న నిధులు ఇచ్చే విషయంలో ఈ స్థాయిలో పేచీ సరికాదని ఏపీ అంటోంది. చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలి. జిల్లాకు 50 కోట్ల చొప్పున 350 కోట్లు చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 350 కోట్లు ఫిబ్రవరిలో రాష్ట్ర ఖజానాకు జమ అయ్యాయి. అయితే… అనూహ్యంగా PMO జోక్యంతో ఇచ్చిన డబ్బులు కూడా మళ్లీ వెనక్కి వెళ్లిపోయాయి. ఫిబ్రవరి 9వ తేదీన మొత్తం డబ్బును రిజర్వు బ్యాంకు ద్వారా వెనక్కి తీసేసుకుంది. ఈ అరాచకాన్ని సీఎం చంద్రబాబు పలు వేదికలపై ప్రశ్నించారు. కేంద్రం ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ మరోమారు స్పందించడం ఏపీకి కాస్త ఊరటనిచ్చే అంశమే. ఐతే.. ఇప్పటికైనా మోడీ కరుణిస్తారా.. ఏపీకి ఇవ్వాల్సినవి ఇస్తారా.. అన్నది వేచి చూడాలి.