చెరువులో శవమై తేలిన హెచ్‌ఐవీ బాధితురాలు.. దాంతో గ్రామస్తులు..

ఆమెకు హెచ్‌ఐవీ సోకింది. జీవితం నిరర్థకమని భావించి చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. కర్ణాటక హుబ్లీ జిల్లాకు చెందిన ఓ మహిళకు హెచ్‌ఐవీ ఉందని వైద్యులు నిర్థారించారు. దీంతో అయిన వాళ్లంతా ఆమెను దూరం పెట్టారు. కనీసం పలకరించే వారు లేరు. వ్యాది నయం చేయించుకునేందుకు తగినంత డబ్బు కూడా లేదు.

మానసిన వేదనతో కుమిలిపోయిన ఆమె బ్రతుకుపై విరక్తి చెంది గ్రామంలోని చెరువులో దూకేసింది. నవంబరు 29న చెరువులో ఆమె మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. గ్రామస్తులకు తాగేందుకు ఆనీరే ఆధారం. అయితే హెచ్‌ఐవీ సోకిన మహిళ శవం చెరువులో కనిపించేసరికి ఆ నీటిని తాగడానికి గ్రామస్థులంతా మూకుమ్మడిగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

చెరువులోని నీరంతా హెచ్‌ఐవీ వైరస్‌‌తో కలుషితమై ఉంటుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని గ్రామాధికారికి విన్నవించి చెరువులోని నీటినంతా మీరు తోడించే ఏర్పాట్లు చేస్తారా లేదంటే తామే ఆపని చేస్తామన్నారు. గ్రామాధికారులు చెరువు నీటిని ల్యాబ్ టెస్ట్‌కి పంపిస్తామని చెప్పినా గ్రామస్తులు వినలేదు.

అధికారులకు చెబితే పని అయ్యేలా కనిపించట్లేదని దాదాపు వెయ్యి మంది గ్రామస్తులు కలిసి ఎనిమిది వాటర్ ట్యాంకులు తీసుకుని చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులోని నీటిని తోడడానికి నడుం బిగించారు. పరిస్థితి తెలుసుకున్న అధికారులు సిబ్బంది సహాయంతో రంగంలోకి దిగి 4 మోటార్లు, 20 ట్యూబుల సాయంతో చెరువులోని మొత్తం నీటిని బయటకు తోడేశారు.

చెరువుని శుభ్రం చేసిన తరువాత మాలాప్రభ కెనాల్ ద్వారా నీటిని నింపుతున్నారు. కాగా, రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ డైరక్టర్ డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ గ్రామస్తుల భయానికి ఎలాంటి శాస్త్రీయత లేదని చెప్పారు. హెచ్‌ఐవీ వైరస్‌తో నీరు మొత్తం కలుషితమైందని భావించడం సరికాదన్నారు. 25 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నీటిలో 8 గంటలకు మించి వైరస్ బతకలేదని ఆయన తెలిపారు.