36 ఏళ్ల క్రితం భార్య అదృశ్యం.. 70 ఏళ్ల భర్త..

australian-women-missing-mystery-police-arrest-her-husband-now

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 36 ఏళ్ల కిందట అదృశ్యమైన మహిళ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగా మహిళను హత్య చేసి ఉంటాడని 70 ఏళ్ల వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిస్‌ డాసన్‌, లినెట్టి ఇద్దరు ఆస్ట్రేలియాకు చెందిన దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. క్రిస్‌ కు అప్పట్లో కొందరు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 1982 ఆయన భార్య లినెట్టి అదృశ్యమైంది. దాంతో లినెట్టి సోదరుడు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు పోలీసులు. క్రిస్ ను విచారించగా ఆమె మతప్రచార బోధకులతో వెళ్లి ఉంటుందని అప్పట్లో చెప్పాడు. అయితే పోలీసులు క్రిస్ వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరింత లోతుగా విచారించారు.. ఆయన స్కూలు టీచరుగా పనిచేసే సమయంలో తన విద్యార్థినులతో క్రిస్‌కు వివాహేతర సంబంధాలు ఉండేవనే ఆరోపణలు ఉన్నాయి.

Also read : పనిమనిషిని చంపి.. చివరకు ఎలా బుక్కయ్యాడో చూస్తే..

అందులో ఓ విద్యార్థినిని లినెట్టి అదృశ్యమయ్యాక పెళ్లి చేసుకున్నాడు. అయితే అంతకుముందు వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తుందన్న కారణంతో లినెట్టిని హతమార్చినట్టు పోలీసులు అనుమానించారు. కానీ ఎటువంటి సాక్షాలు దొరకలేదు. దాంతో ఈ కేసు మరుగున పడిపోయింది. అయితే ఇటీవల లినెట్టి అదృశ్యానికి సంబంధించిన వార్తలు పోడ్‌క్యాస్ట్‌ల రూపంలో వైరల్‌గా మారాయి. ‘ద టీచర్స్‌ పెట్‌’ గా క్రిస్‌ స్టోరీ ప్రచురితమైంది. దీంతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగి విచారణను వేగవంతం చేశారు. 36 ఏళ్ల తరువాత క్రిస్ ను అదుపులోకి తీసుకుని హత్య అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ విచారణలో అయినా క్రిస్ తన భార్య లినెట్టి గురించి చెబుతాడా అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.