పిల్లలు లేని వారికి గుడ్ న్యూస్

trending

మాతృత్వం మహిళలకు వరం. కానీ ఆరోగ్య సమస్యలు కొందరికి ఆ వరాన్ని దూరం చేస్తున్నాయి. అలాంటివారికి సైన్స్ అదృష్టంగా మారింది. అమ్మతనానికి తపన పడినవారి కల నెరవేరుస్తోంది. గర్భాశయ మార్పిడితో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. మరణించిన మహిళ గర్భాశయంలో శిశువు జన్మించడం ఊహించగలమా? కానీ వైద్య నిపుణులు ప్రతిసృష్టిచేసి నిరూపించారు. వైద్య చరిత్రలో ఇదో అద్భుత విజయం. మరి ఈ మెడికల్ మిరాకిల్ ఎలా సాధ్యమైంది?

గర్భాశయ మార్పిడి కొత్త కాదు. అయితే చనిపోయిన మహిళ గర్భాశయాన్ని మార్పిడి చేసి అందులో జీవం పోసుకునేలా చేయడమే కొత్త. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు బ్రెజిల్‌ వైద్య నిపుణులు. ఇలా మార్పిడి చేసిన గర్భాశయంతో ప్రపంచంలోనే తొలిసారి పాపకు జన్మనిచ్చింది ఓ మహిళ. సావ్‌ పాలో హాస్పిటల్‌లో ఆ మహిళ పండంటి శిశువుకు జన్మనిచ్చింది….

అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతమంది మహిళలు గర్భాశయాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా పిల్లలు కనాలని ఎన్నో కలలుగన్న మహిళలు మాతృత్వానికి దూరమవుతున్నారు. ఇలాంటివారికి సంతానం కలిగేలా చేయాలంటే దాతల నుంచి సేకరించిన యుటెరస్‌ను అమర్చాలి. కానీ అది అంత ఈజీకాదు. గర్భాశయాన్ని ఎవరు దానం చేస్తారు? ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలను వేధించింది. దీనికి మరణించిన మహిళల యుటెరస్‌ను ప్రత్యామ్నాయంగా భావించారు. మాతృత్వం కోసం తపిస్తున్న మహిళలకు అమర్చి సంతాన భాగ్యాన్ని కలిగించాలని ఎన్నో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు చివరికి విజయం సాధించారు. అమెరికా, చెక్ రిపబ్లిక్, టర్కీలలో పది మంది మహిళలకు మరణించినవారి నుంచి సేకరించిన గర్భాశయాలను అమర్చారు. కానీ సంతానం కలిగేలా చేయలేకపోయారు….

పది కేసుల్లోనూ సంతానం కలిగేలా చేయడంలో వైద్య నిపుణులు సక్సెస్ కాలేకపోయినా… వీటి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం పాపకు జన్మనిచ్చిన బ్రెజిల్ మహిళకు యుటెరస్ అమర్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 32 ఏళ్ల ఈమెకు 2016లో గర్భాశయాన్ని అమర్చారు. మరణించిన మహిళ నుంచి గర్భాశయాన్ని సేకరించిన తర్వాత… దానిలోని సిరలు, ధమనులు, లిగమెంట్స్, వెజినల్ కెనాల్స్… డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటిని గ్రహీత మహిళ సిరలు, ధమనులు, లిగమెంట్స్, వెజినల్ కెనాల్స్‌తో అతికించేటప్పుడు ఏ మాత్రం తేడా రాకుండా సరిగ్గా అమర్చారు. కొన్నిరోజులకే దాత యుటెరస్‌ పనిచేయడం మొదలుపెట్టింది. దీంతో వైద్యుల కృషి ఫలించింది….

యుటెరస్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ తర్వాత మహిళ గర్భం దాల్చింది. 35 వారాలకు ఆమెకు సిజేరియన్ చేసి పురుడు పోశారు డాక్టర్లు. ఆమె 2 కిలోల 550 గ్రాముల బరువున్న పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ సేఫ్‌గా ఉన్నారు. సంతానం కనాలనే కల ఇక కలగానే మిగిలిపోతుందేమో అనుకున్న ఆమెకు ఇది ఊహించని వరం. సృష్టికి ప్రతిసృష్టి చేయడం అసాధ్యం. కానీ దాన్ని సుసాధ్యం చేశారు వైద్య నిపుణులు. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఘనతగా రికార్డులకు ఎక్కింది.