అనంతపురం జిల్లా జాతకం మారిపోతోంది : సీఎం చంద్రబాబు

cm chandrababu test drive on kiya moters

మేకిన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో రాష్ట్రంలో ఏర్పాటైన కియా మోటార్ తెలుగు నేలపై తమ తొలి ఉత్పత్తిని ప్రారంభించింది. సంస్థ తయారు చేసిన నిరో హైబ్రిడ్‌, నిరో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, నిరో ఎలక్ట్రికల్‌ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి కియా మోటార్స్ బహుమతిగా అందజేసింది. ఈ కార్లను చంద్రబాబు స్వయంగా ప్రారంభించారు. వీటికి సంబంధించి ఎలక్ట్రిక్ ఛార్జింగ్‌ స్టేషన్‌ను సచివాలయంలో ఆయన అందుబాటులోకి తెచ్చారు. బహుమతిగా ఇచ్చిన కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రారంభించి టెస్ట్ డ్రైవ్‌ చేశారు సీఎం.

Also read : పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

కియా మోటార్ తో అనంతపురం జిల్లా జాతకం మారిపోతుందని అన్నారు చంద్రబాబు. ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు. ఇది కొత్త యుగం వైపు ప్రయాణానికి తొలి అడుగుగా అభివర్ణించిన చంద్రబాబు.. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందన్నారు.

రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కియా మోటార్ కూడా ఇందులో భాగమైంది. బ్యాటరీ కార్ ను టెస్ట్ డ్రైవ్ చేసిన చంద్రబాబు..ఇక్కడ తయారైన కార్లలో 90 శాతం దేశీయ అవసరాలకు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. మరో 10 శాతం ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నారు. పీల్చే గాలిలో నాణ్యత పెంచడానికి విద్యుత్తు కార్లు ఎంతో దోహదపడతాయన్నారు చంద్రబాబు.

రానున్న రోజుల్లో సౌరవిద్యత్తు యూనిట్ రూపాయిన్నరకే లభించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది ఏపీ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో వ్యర్ధ పదార్ధాల సేకరణకు 7,300 ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయటంలో భాగంగా…ఏపీఐఐసీ ఎండీ ఎ. బాబు, కియా మోటర్స్ సీఈవో షిమ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కియా బ్యాటరీ కార్ల ఉత్పత్తి జనవరి నుంచి పూర్తి స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్లకు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు.