అబ్బాయిలతో మాట్లాడారో..: యూనివర్సిటీలో కొత్త రూల్

కాలేజీలకు వచ్చిన టీనేజ్ యువతీ యువకులు క్లాస్ రూముల్లోనుంచి బయటకు వస్తూనే బోలెడు కబుర్లు. అది ఒకే జండర్‌తో కంటే ఆపోజిట్ జండర్‌తోనే ఎక్కువ ఉంటాయి. కాలేజీ గేటు బయట నుంచి మొదలు పెట్టి ఇంటి గేటు వరకు ఎన్నో విషయాలు వారి మధ్య ప్రస్తావనకు వస్తాయి.

వారి మధ్య ఉన్న స్నేహ బంధం కాస్తా ప్రేమగా మారే అవకాశాలు కూడా కాలేజీ రోజుల్లోనే మొదలవుతాయి. మరి వీటన్నింటికీ బ్రేక్ వేసేందుకు ఒడిస్సాలోని వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వైస్ ఛాన్స్‌లర్ కళాశాల విద్యార్థినులకు వివాదాస్పద నోటీసు జారీ చేశారు. ఇకపై కళాశాల అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వీసీ హెచ్చరించారు.

చదువుని పక్కన పెట్టి స్నేహం పేరుతో ఎంతో అమూల్యమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని దాన్ని కట్టడి చేసే నిమిత్తంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని వీసీ అంటున్నారు. అయితే ఈ పత్వా జారీపై అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాము బాలికల భద్రత కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ప్రొఫెసర్ పీసీ స్వైన్ వివరించారు.