ఎన్నికలు వచ్చేశాయి.. ఓటు ఎలా వెయ్యాలి.. ఇదిగో ఇలా..

telangana election special story

డిసెంబర్ 7వ తేదీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న రోజు.. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్ ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి విశ్వప్రయత్నాలు చేశారు. సామాజిక మాధ్యమాలు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో అవగాహన కల్పించారు. అయినా కూడా కొంతమంది ఓటర్లలో సందేహాలు ఉన్నాయి. పట్టణాల్లోని ఓటర్లు.. తాము ఓటు వేసే పోలింగ్ స్టేషన్ చిరునామా తెలియక తికమక పడుతుంటారు. అయితే ఈ సందేహానికి ఆన్ లైన్ కూడా ఒక మార్గం..

ఇందుకోసం ఓటర్లు ఇలా చెయ్యాల్సి ఉంటుంది.

*ముందుగా ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ http://www.ceotelangana.nic.in/ ను బ్రౌజర్ లో ఓపెన్ చెయ్యాలి.

*కేటగిరీలో ‘సెర్చ్ యువర్ నేమ్’ టాబ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో Assembly constituency ని ఎంపిక చేసుకోవాలి.

*తరువాత కంటిన్యూ క్లిక్ చెయ్యాలి. ఓటరు వివరాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Search by Details / Search by EPIC No అని రెండు ఆప్షన్లు వస్తాయి. వాటిలో Search by EPIC No ను ఓపెన్ చేసి ఎపిక్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. ఆ తరువాత రాష్ట్రం సెలెక్ట్ చేసి.. క్యాప్చ ఎంటర్ సెర్చ్ చేయగానే మీ ఓటుకు సంబంధిన వివరాలు వస్తాయి. అందులోనే మీరు ఓటు చేసే పోలింగ్ స్టేషన్ చిరునామా కూడా ఉంటుంది.

ఇక ఓటు ఎలా వెయ్యాలి..

పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించగానే మొదట అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అతని వద్ద పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన ఓటర్ల జాబితా ఉంటుంది. ఓటర్ గుర్తింపు కార్డు.. కానీ మీ వద్ద అందుబాటులో ఉన్న రేషన్ కార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లాంటి ధ్రువీకరణ పత్రాన్ని అతనికి చూపించాలి. అప్పుడు ఆ అధికారి ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూస్తారు. ఇదే క్రమంలో మీ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలిస్తారు. తర్వాత ఆ పోలింగ్ అధికారి మీ పేరును, ఓటర్ల జాబితాలోని సీరియల్ నంబరును పక్కనున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లకు వినిపించేలా బిగ్గరగా చదువుతారు. అప్పుడు పోలింగ్ ఏజెంట్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేనిక్రమంలో రెండో పోలింగ్ అధికారి వద్దకు వెళతారు.

రెండో పోలింగ్ అధికారి మొదట మీ వేలిపై సిరా గుర్తు వేస్తారు. ఆ తరువాత అతని వద్ద ఉన్న రిజిస్టర్‌లో మీ పేపరు, ఓటర్ల జాబితాలో ఉన్న సీరియల్ నంబరు కలిపి నమోదు చేస్తారు. దాని తరువాత మీరు ఆ రిజిస్టర్‌లో సంతకం లేదా ఆ అవకాశం లేనివారు వేలిముద్ర వేయాలి. తర్వాత ఆ అధికారి సంతకం చేసిన ఓటర్ స్లిప్ మీకు ఇస్తారు. దాంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వద్దకు వెళ్ళాలి.

ఇక ఈవీఎంలో వరుస క్రమంలో పోటీపడుతున్న అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. ప్రతి గుర్తు పక్కనా ఒక్కో నీలంరంగు బటన్ ఉంటుంది. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటే ఆ అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలంరంగు బటన్‌ను నొక్కాలి. అది నొక్కగానే అభ్యర్థి పేరు, గుర్తుకు మరో వైపు ఉన్న ఎర్ర బల్బు వెలుగుతుంది. దాంతోపాటుగా మీకో స్లిప్ వచ్చి ‘బీప్’ అని శబ్దంవస్తుంది. అంటే మీ ఓటు నమోదయిందని అర్థం. ఇదంతా అయిపోయాక మీరు ఏ అభ్యర్ధికి ఓటువేశారో అని ఒక స్లిప్ వస్తుంది. దాన్ని ఎవరికీ చూపించకుండా ఇంటికి వెళ్లిపోవడమే.