రాజకీయ రంగంలోకి అడుగు పెట్టనున్న మాధురీ దీక్షిత్..!

అందచందాలతో పాటు అభినయంతోనూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మాధురీ దీక్షిత్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాధురి పేరును బీజేపీ నాయకత్వం సీరియస్‌గా పరిశీ లిస్తోందని సమాచారం. పుణె లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాధురిని పోటీ చేయించాలని కమలదళం ఆలోచనగా చెబుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పుణె లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల జాబితాలో మాధురి పేరు ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

2014లో పుణె లోక్‌సభ సీటును బీజేపీ గెలుచుకుంది. కమలం అభ్యర్థి అనిల్ శిరోలే, కాంగ్రెస్ అభ్యర్థిపై 3 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఐతే సిట్టింగ్ ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించే ప్రమాదముందనే అనుమా నంతో కమలదళం స్ట్రాటజీ మార్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా కొత్త అభ్యర్థులను పోటీలో పెట్టాలని, వారిలో ప్రజలకు బాగా పరిచయమున్న సినీ, క్రీడారంగాల ప్రముఖులు ఉండేలా చూడాలని బీజేపీ నాయకత్వం ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే పుణె లోక్‌సభ స్థానం నుంచి మాధురి దీక్షిత్‌ను పోటీ చేయించాలని కమల దళం భావిస్తున్నట్లు సమాాచారం.

ఈ ఏడాది జూన్‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా, మాధురీ దీక్షిత్‌ను ముంబైలో కలిశారు. సంపర్క్ ఫర్ సమర్థన్ పేరుతో చేప ట్టిన కార్యక్రమంలో భాగంగా మాధురినీ కలసిన అమిత్ షా, గత నాలుగేళ్ల కాలంలో మోదీ సర్కారు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను వివరించారు. బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. అప్పుడే మాధురీ దీక్షిత్ రాజకీయ ప్రవేశంపై చర్చలు జరిగినట్లు సమాచారం. బీజేపీ తరపున పోటీ చేయాలని, పుణె సీటును ఆఫర్ చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

సిట్టింగ్ ఎంపీలు బాగా పని చేసి ఉంటే పెద్దగా ప్రాబ్లెమ్ ఉండదు. ఒకవేళ పని చేయకపోతే అటు విపక్షలతో పాటుగా ప్రజల నుంచి విమర్శలు తప్పవు. వీటిని తప్పించుకోవాలంటే కొత్త అభ్యర్థులే బెటరన్నది కమలదళం భావన. కొత్త వాళ్లైతే విపక్షాలకు విమర్శించడానికి పెద్దగా అవకాశముండదని, పైగా గ్లామర్‌తో ఓటరు గ్రామర్‌ను అనుకూలంగా మార్చుకోవచ్చని కాషాయదళం అంచనా వేస్తోంది.