తెలంగాణాతో పాటు మరో కీలక రాష్ట్రానికి రేపు పోలింగ్

ఉత్తరభారతావనిలో అత్యంత కీలకమైన రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 2,274 మంది బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు..

తెలంగాణతో పాటు ఉత్తరభారతావనిలో అత్యంత కీలకమైన రాజస్థాన్‌లోనూ ఎన్నిక ప్రచారం ముగిసింది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఎన్నికల ప్రచారం, పార్టీల ఊరేగింపులు, బల్క్ ఎస్ఎంఎస్ లపై ఈసీ నిషేదం విధించింది. మరో వైపు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ సిబ్బందిని, సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు.

డిసెంబరు 7న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు . రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే రామ్‌గఢ్ బిఎస్‌పి అభ్యర్థి లక్ష్మణ్‌ సింగ్‌ గుండెనొప్పితో మృతి చెందడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు.. మొత్తం 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు బరిలో పోటీపడుతున్నారు. ఈఎన్నికల్లో మొత్తం 4 కోట్ల 74 లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు…

ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంది. గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి 189 మంది మహిళలు పోటీ పడుతున్నారు.. బీజేపీ 200, కాంగ్రెస్ 195, స్థానాల్లో పోటీ చేస్తోంది. 33 జిల్లాలున్న రాజస్థాన్ లో 34 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలున్నాయి. ఎన్నికల కోసం 51 వేల 796 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. శాంతి భద్రతల కోసం రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా వినియోగిస్తున్నారు.

ప్రతి ఐదేళ్ల కోసారి రాజస్థాన్ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఐతే ఈసారి కూడా అధికార మార్పిడి జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటర్లు ఏపార్టీకి పట్టం కట్టనున్నారో.. అనేది ఆసక్తికరంగా మారింది.. డిసెంబర్ 11న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి….