బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు 26 ఏళ్లు..

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు పూర్తయి 26 ఏళ్లు అయింది.. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో ఇటీవలి కాలంలో సంఘ్ పరివార్ సంస్థలు తమ గళాన్ని పెంచిన నేపథ్యంలో అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6 ను ముస్లిం సంస్థలు బ్లాక్ డేగా పాటించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

1992 డిసెంబరు 6న హిందూత్వ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ శౌర్య దివస్‌, విజయ్‌ దివస్‌ గా జరుపుకుంటున్నాయి. మరో వైపు ముస్లిం వర్గాలు సంతాప దినం, చీకటి రోజులుగా పాటిస్తునాయి. అటు బాబ్రీ ఘటనను పురస్కరించుకొని అయోధ్యలో సౌర్య దివస్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ తెలపడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా అణువణువూ తనిఖీ చేశారు. సినిమా హాళ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు సహా అయోధ్యలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయోధ్యలో ప్రవేశించే వాహనాలపై నిఘా వేసేందుకు నగర శివార్లలో ప్రత్యేక బృందాలను మోహరించారు.

అటు బాబ్లీ మసీదు కూల్చివేతకు నిరసనగా పలుచోట్ల ముస్లీంలు ఆందోళనకు దిగారు. సేవ్‌ డెమోక్రసీ పేరుతో ఢిల్లీలో వామపక్షాల నేతలు మసీదు కూల్చివేతను ఖండిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు ఆయోద్యలో సాదువులు, హిందూ సంస్థలు సౌర్య దివస్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలంలో యధాతథ స్థితి కొనసాగించాలంటూ బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.