తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తీవ్ర ఉత్కంఠ మధ్య, కొన్నిచోట్ల ఉద్రిక్తతల మధ్య ఓటరు దేవుడు అభ్యర్థుల తలరాత రాసేశాడు. పార్టీల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈనెల 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓటింగ్ యంత్రాలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇవాళ్టి పోలింగ్‌ దాదాపు ప్రశాంతంగానే సాగినా.. మూడు విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఒకటి.. కూటమి అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై దాడి. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయన వెళ్లగా.. ప్రత్యర్థి పార్టీకి చెందిన కొందరు రాళ్లతో ఎటాక్ చేశారు. తీవ్రంగా గాయపడిన వంశీచంద్‌ రెడ్డిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

ఇవాళ హాట్‌ టాపిక్‌గా నిలిచిన రెండో అంశం కేసీఆర్ వ్యాఖ్యలు. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలమే రేపాయి. ముఖ్యంగా కమలనాథులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఏదో పొరపాటున కేసీఆర్ మాట్లాడలేదని.. ఓటర్లను ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడారని బీజేపీ నేతలు సీరియస్‌ అయ్యారు. ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

పోలింగ్ సందర్భంగా తీవ్ర కలకలం రేపిన మూడో అంశం ఓట్ల గల్లంతు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో వందల కొద్దీ ఓట్లు మిస్సయ్యాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఓటర్లు అధికారులను నిలదీశారు. ఇంటర్నెట్‌లో తమ ఓటు కనిపించిందని.. బూత్‌కు వెళ్తే మాత్రం లేదంటూ తిప్పిపంపారని బాధితులు లబోదిబోమన్నారు. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. చేసేదేమీలేక వెనుదిరగాల్సి వచ్చింది.