ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా..

rajasthan-assembly-elections-creates-new-record

తెలంగాణతో పాటు అత్యంత కీలకమైన రాష్ట్రం రాజస్థాన్‌లో కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే రామ్‌గఢ్ బిఎస్‌పి అభ్యర్థి లక్ష్మణ్‌ సింగ్‌ గుండెనొప్పితో మృతి చెందడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు. దీంతో ప్రస్తుతం 199 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 2 వేల 274 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 51 వేల 796 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది.. ఈఎన్నికల్లో మొత్తం 4 కోట్ల 74 లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శాంతి భద్రతల కోసం రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా వినియోగిస్తున్నారు. ప్రతి ఐదేళ్ల కోసారి రాజస్థాన్ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఐతే ఈసారి కూడా అధికార మార్పిడి జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాజస్థాన్‌లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంది. గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి 189 మంది మహిళలు పోటీ పడుతున్నారు. బీజేపీ 200, కాంగ్రెస్ 195 స్థానాల్లో పోటీ చేస్తోంది. 33 జిల్లాలున్న రాజస్థాన్‌లో 34 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలున్నాయి. ఓటర్లు ఏపార్టీకి పట్టం కట్టనున్నారో.. అనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 11న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.