పోలింగ్ పర్వం ప్రశాంతంగా ముగిసింది : ఎన్నికల కమిషన్

telangana-poling-is-over

ఉత్కంఠగా సారిగిన తెలంగాణలో పోలింగ్ పర్వం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 72 శాతం ఓటింగ్ నమొదైంది. అత్యాధింగా నర్సంపేటలో 84 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా యాకత్ పురాలో 33 శాతం నమోదైంది. ఆలేరు నియోజకవర్గంలో 83 శాతం ఓటింగ్ జరిగింది. గ్రేటర్ ఓటర్లు మళ్లీ బాధ్యత మరిచారు. ఈసీ ఎన్ని చర్యలు చేపట్టినా.. పోలింగ్ డేని ఎంజాయ్ డేగా పరిగణించారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఓటింగ్ ఎప్పటిలాగే తక్కువగా నమొదైంది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్ మందకొడిగానే సాగింది. అర్బన్ తో పొలిస్తే రూరల్ ఏరియాల్లో ఓటింగ్ ఎక్కుగా నమోదైంది.

ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అవగా… కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో పొలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఏడుగంటల నుంచి 9 గంటల మధ్య పలు నియోజకవర్గాల నుంచి ఈవీఎం పని చే్యటం లేదంటూ ఫిర్యాదులు అందాయి. వెంటనే చర్యలు ఈసీ చర్యలు చేపట్టడంతో ఆ తర్వాత పోలింగ్ సజావుగా సాగింది. చలికాలం కావటంతో ఉదయం పోలింగ్ ప్రారంభంలో కాస్త పోలింగ్ నెమ్మదించినా… 9 గంటల తర్వాత ఊపందుకుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. వారికి సాయం చేసేందుకు వాలంటీర్లను కూడా నియమించారు. మహిళలకు ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు.

ఓవరాల్ గా పోలింగ్ ప్రశాంతంగా జరిగినా.. కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కార్వాన్‌లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో 4 గంటల ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైందని..సూర్యాపేట జిల్లా రంగాపురం తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని నేతలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా వనపర్తి జిల్లా పశ్యా తండా వాసులు సైతం ఎన్నికలను బహిష్కరించారు. తమ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వలేదంటూ భద్రాద్రి కొత్తగూడం నియోజకవర్గంలో ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. పట్టాలు ఇస్తేనే ఓటు వేస్తామని ఆందోళనకు దిగారు. ఇక కొడంగల్ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 119 స్థానాల్లో 13 సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటలకే వరకు పోలింగ్ ముగిసింది. ఈ సమస్యాత్మక నియోజకవర్గాల్లో 74 శాతం పోలింగ్ నమోదైంది. మిగిలిన చోట్ల ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో నిల్చుకున్న వాళ్లను ఆ తర్వాత కూడా ఓటింగ్ కు అవకాశం కల్పించారు.