గంటే ఉందండి.. ఓటేసి రండి

ఓటు వేయమని సెలవు కూడా ఇచ్చారు దాదాపు అన్ని ఆఫీసులకి. పెద్ద వారు సైతం ఓటు వేయడానికి ఎంతో ఉత్సాహంగా పోలింగ్ బూతులకు వస్తున్నారు. మరి మీరు మాత్రం ఎందుకు వేయట్లేదు. లిస్ట్‌లో పేరు లేదనో, మరొకటనో ఓటు వేయకుండా ఉండకండి. చివరి నిమిషం వరకు మీ కోసం వేచి ఉంటారు పోలింగ్ సిబ్బంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం ఓటర్లు 2,80,74,722 మంది వినియోగించుకుంటున్నారు. 52329 ఈవీయమ్‌లను ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32815 పోలింగ్ సెంటర్లు ఓటింగ్ కోసం ఏర్పాటు చేయబడ్డాయి.

పదివేలకు పైగా సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రధానాధికారి తన కార్యాలయం నుండి మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా సమస్యలేమీ
లేవని సమాచారం అందుతోంది. రాజ్యాంగంలోని ప్రతి పౌరుడు ఓటు హక్కుని వినియోగించుకోవడం తమ బాధ్యతగా గుర్తించాలి.

ఉదయం 7గంటలనుంచి మొదలు పెట్టి సాయింత్రం 5 గంటల వరకు ఓటు హక్కుని వినియోగించుకోమని ప్రముఖులు పిలుపునిచ్చారు. అయినా అనుకున్నంతగా ఓట్లు పడలేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మీరు ఓటు వేయవచ్చు. మీ దగ్గరలోని పోలింగ్ బూత్‌కి వెళ్లి సమాజం పట్ల మీ బాధ్యతని నిర్వర్తించండి.