విజయవాడలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

విజయవాడలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేసి అందినకాడికి దోచుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు. విజయవాడలో ఇదే తరహా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ ఫెసిలిటీస్ సర్వీస్ పేరుతో అమాయక నిరుద్యోగులకు ఉద్యోగాల ఎరజూపి ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల నుండి 3 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. అనంతరం కోట్లరూపాయలతో జెండా ఎత్తేశారు. బాధితులు టీవీ5న ఆశ్రయించడంతో వారి బాగోతం బయటపడింది.

నిరుద్యోగుల బలహీనతే పెట్టుబడిగా కిషోర్ రెడ్డి, రవికుమార్, శ్రీనివాస్ తో పాటు మరికొందరు కలిసి గ్లోబల్ ఫెసిలిటీస్ సర్వీస్ పేరుతో ఓ బోగస్ సంస్థ ఏర్పాటుచేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించారు. అనంతరం ఒక్కొక్కరి దగ్గరి నుంచి లక్ష నుంచి 3లక్షల దాకా వసూలు చేశారు. ఇలా వేల మంది నిరుద్యోగుల వద్ద సుమారు 60 కోట్ల రూపాయలు వసూలు చేసి గప్ చుప్ గా జంప్ అయిపోయారు.

విజయవాడ బందరు రోడ్డులో గ్లోబల్ ఫెసిలిటీస్ సర్వీస్ పేరుతో కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకున్నారు. బీఎస్ యన్ యల్, టవర్ మేనేజ్ మెంట్ లాంటి సంస్థలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల టెండర్లు తమ సంస్థకు వచ్చాయని.. తామే స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికారు. జిల్లా హెడ్ , కో ఆర్డినేటర్స్, సూపర్ వైజర్స్ ఉద్యోగాలున్నాయని.. నెలకు 20 వేల నుండి 30వేల వరకు జీతాలు వస్తాయని బిల్డప్ ఇచ్చారు. డిసెంబర్ లోనే ట్రైనింగ్ మొదలుపెడతామని చెప్పడంతో.. వారి మాటలు నమ్మిన నిరుద్యోగులు డబ్బు కట్టారు.

గత నవంబర్ నెలలో గ్లోబల్ ఫెసిలిటీస్ సర్వీస్ వాళ్లను సంప్రదించగా.. డిసెంబర్ 3వ తేదీన ట్రైనింగ్ మొదలవుతుందని మిగిలిన వారు కూడా డబ్బులు చెల్లించాలని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలుచేసి చెక్కేశారు కంత్రీగాళ్లు. ట్రైనింగ్ కోసం ఆఫీస్ దగ్గరకు వెళ్లగా.. తాళాలు వేసి ఉండడంతో అనుమానం వచ్చిన బాధితులు నిర్వాహకులకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు.

గ్లోబల్ ఫెసిలిటీస్ సర్వీస్ నిర్వాహకులకు ఉద్యోగాల కోసం డబ్బులు కట్టి మోసపోయినట్టు ఫిర్యాదులు అందాయని.. వారిపై చీటింగ్ కేసు నమోదుచేశామని కృష్ణలంక సిఐ సత్యానందం తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి...హైదరాబాద్,విజయవాడలో నిందితులకోసం గాలిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడం కొందరికి పరిపాటిగా మారిందని...ఇప్పటికైనా నిరుద్యోగులు ఇలాంటి కేటుగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story