ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యం.. మూడు కోట్ల దేవతలతో భూలోకానికి..

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతోంది. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా దైవ దర్శనం చేసుకుంటున్నారు.

ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశికి విశేష ప్రాధాన్యముంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయి. వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం చేసుకుంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

Also Read : గోవింద నామస్మరణతో మారు మోగుతున్న ఆలయం

ఇక భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం జరిగింది. తొలుత శ్రీ సీతా లక్ష్మణ సమేతంగా శ్రీ రామచంద్ర మూర్తి మాఢ వీధుల గుండా మేళతాళాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా గోదావరి నదికి చేరుకున్నారు. హంస వాహనంలోనే అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో స్వామి వారి జలవిహారాన్ని రద్దు చేశారు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి స్వామి వారిని ఆలయానికి తీసుకొచ్చారు.

ఇక కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా అసంఖ్యాకంగా తరలివచ్చిన భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. నారాయణగిరి ఉద్యానవనంలో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మాడ వీధుల్లోని గ్యాలరీల్లో సుమారు 5 లక్షలతో జర్మన్ టెక్నాలజీ ద్వారా ప్రత్యేకంగా షెడ్స్ నెలకొల్పారు. క్యూ లైన్లలో అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇక 24 గంటలు గాట్‌ రోడ్లు తెరిచే ఉంచుతున్నారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ చెబుతోంది.