పూలవనంగా మారిన కలియుగ వైకుంఠం తిరుమల

Tirumala temple

కలియుగ వైకుంఠం తిరుమల పూలవనంగా మారింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం రంగుల పూవులతో వెలిగిపోతోంది. సువాసనలు వెదజల్లే పుష్పాలు, పత్రాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సప్తగిరులపై వెలిసి, కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందుకే పర్వదినాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ ఉద్యాన వనవిభాగం చేసిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మహాద్వారం నుంచి వైకుంఠ ద్వారాలకు అలంకరించిన సంప్రదాయ పుష్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తులసీ, మరువం, దవనం పత్రాలతో రూపొందించిన 450 చిలుకలు, చెరుకు గడలు, పలు రకాల పండ్లు, పత్రాలు అబ్బుర పరిచాయి.

మహాద్వారం ముందు భాగంలో లక్ష్మీసమేత శ్రీ మహా విష్ణువు ప్రతిమ ఆలయానికి మరింత వన్నె తెచ్చింది. అలాగే మహారథ మండపం పక్కన విష్ణుమయం పేరుతో ఏర్పాటు చేసిన ఫైబర్ ప్రతిమలు భక్తులకు కనువిందు చేశాయి.

సప్తద్వారాల లోపల శ్రీరంగనాథ స్వామి, రంగనాయకి అమ్మవారు, శ్రీ మహా విష్ణువు, దశావతారల ప్రతిమలు ఆకట్టుకున్నాయి. ఇక శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుదీపాలంకరణలు పరవశింపచేశాయి.