నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్11.. జీశాట్ 7A ప్రయోగం సక్సెస్

GSLV mark3 satilite

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో సమాచార ఉపగ్రహం జీశాట్ 7ఏని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 26 గంటల కౌంట్ డౌన్ తర్వాత సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు జీఎస్ఎల్వీ-F11 నింగిలోకి దూసుకెళ్లింది. తుపాన్ ఎఫెక్ట్ తో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వొచ్చని కౌంట్ డౌన్ సమయంలో భయపడినా..లాంచింగ్ సమయానికి వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా జీఎస్ఎల్వీ ఎఫ్11 ద్వారా 2,250 కిలోల జీశాట్ 7ఏ ఉప గ్రహాన్ని సక్సెస్ ఫుల్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. 35 రోజుల తేడాతో ఇది మూడో ప్రయోగం కావటం విశేషం.

రాకెట్ లాంచింగ్ తర్వాత 140 సెకన్లలో తొలిదశ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సెకండ్ స్టేజ్ కూడా సక్సెస్ ఫుల్ గా ముగించుకొని..ఓవరాల్ గా 18 నిమిషాల్లో జీశాట్ 7ఏ ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 24 గంటల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ఆ ఉపగ్రహాన్ని దిశ మార్చి పూర్తి స్థాయి కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అప్పట్నుంచి సమాచార వ్యవస్థ కు సంబంధించిన జీశాట్‌ 7-ఏ తన సేవలను ప్రారంభిస్తుంది.

అడ్వాన్స్ మిలటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ గా రూపొందించిన జీశాట్ 7ఏ ప్రయోగం సక్సెస్ కావటంతో ఇస్రోలో సంబరాల్లో మునిగిపోయింది. శాటిలైట్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ప్రకటించగానే శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షద్వానాలు వ్యక్తం చేశారు. జీశాట్ 7ఏ లో అధునాతన సాంకేతికను ఉపయోగించామని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.

జీశాట్-7ఏ సమాచార ఉపగ్రహంలో ముప్పై ఐదవది. 2013లో ప్రయోగించిన జీశాట్-7 ఉపగ్రహం కాలపరిమితి మించిపోవడంతో దాని స్థానంలో ఈ ఉపగ్రహాన్ని కక్ష్య ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. జీశాట్‌ 7-ఏ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు సమాచార రంగానికి సంబంధించి సేవలను అందించనుంది.

జీశాట్ 7ఏ తో భారత రక్షణ సమాచార వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎయిర్ బేస్ లతో పాటు గ్రౌండ్ రాడార్ వ్యవస్థ, యుద్ధ విమానాల అనుసంధానానికి తోడ్పడుతుంది. అలాగే డ్రోన్ అపరేషన్స్ కు జీశాట్ 7ఏ బూస్టింగ్ ఇవ్వనుంది. కేయు బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తివంతమైన సిగ్నల్స్ అందించేందుకు దోహదపడుతోంది. గగనతలంలో రెండు విమాన మధ్య సమాచార మార్పిండి మరింత సులభం కానుంది.

సమాచార రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా భారతదేశానికి మరింత పటిష్టమైన సమాచార వ్యవస్థను అందించాలన్న ఉద్దేశంతో ఇస్రో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. డిసెంబరు 4న యూరప్‌లోని ఫ్రెంచ్‌ గయానా నుంచి సుమారు 5200 కేజీల బరువు కలిగిన భారీ సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. నవంబరు మొదటి వారంలో మూడు టన్నుల బరువు కలిగిన జీశాట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.