రెండోరోజు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు మహిళా భక్తుల యత్నం

ఆదివారం శబరిమలలో ఏర్పడిన ఉద్రిక్తలు.. రెండో రోజూ కొనసాగుతున్నాయి. పంబ ప్రాంతం వార్‌ జోన్‌గా మారింది. ఆదివారం 11 మంది మహిళల బృందం అయ్యప్ప దర్శనానికి శబరిమలకు చేరుకుంది. ఆలయానికి వెళ్తున్న మహిళా భక్తుల్ని ఆందోళనకారులు అడ్డుకోవడంతో శబరిమల రణరంగంగా మారింది.

సోమవారం కూడా పంబ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెల్లవారుజామునే అయ్యప్ప ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళల్ని హిందుత్వ సంఘాలు అడ్డుకున్నాయి. ఆలయానికి వెళ్లనిచ్చే పరిస్థితిలేదని..వెంటనే వెనక్కి వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం శబరిమల ఆలయ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. నిషేధాజ్ఞాలు అమలు చేశారు. డిసెంబర్‌ 27 వరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు.

పంబ దగ్గరకు ఆందోళనకారులు భారీగా చేరుకుంటున్నారు. పంబ సరిహద్దు రోడ్డును బ్లాక్‌ చేసి అయ్యప్ప నినాదాలు చేస్తున్నారు. అటు మహిళా భక్తులు వెనక్కి తగ్గడం లేదు. ఆలయంలోకి వెళ్లేందుకు తమకు పోలీసులు రక్షణ కల్పించాలని.. దర్శనం చేసుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది.

Also Read : వెంకటేశ్వరస్వామి ఆలయంలో విచిత్రం.. స్వామివారి పాదాల చెంత గరుడ పక్షి

అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ తీర్పును అమలు చేసి తీరతామని కేరళ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి శబరిమల పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. నవంబరు 17న ఆలయం తిరిగి తెరిచినప్పటి నుంచి ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. సన్నిధానంలోకి వెళ్లేందుకు పలువురు మహిళలు ప్రయత్నించడం, వారిని హిందూత్వ సంఘాలు అడ్డుకోవడం నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై జనవరి 22న విచారణ జరగనుంది.