ఇకపై నో డిస్కౌంట్స్.. ఆఫర్లకు కేంద్రం కళ్లెం

ఒకప్పుడు పుట్టినరోజో, పండగో వస్తేనే కొత్త బట్టలు. ఇప్పుడు ఊరిస్తున్న డిస్కౌంట్లు, వద్దంటున్నా వినిపిస్తున్న ఆఫర్లు .. వెరసి ఇంటినిండా గుట్టలుగా పేరుకుంటున్నబట్టలు. పండగలతో పన్లేదు. అయినా పండగొస్తే కట్టుకుందామంటే కొత్త చీర లేదు, వేసుకుందామంటే కొత్త షర్ట్ లేదంటూ పండగ ఆఫర్ల కోసం పరుగు..

ఇకపై ఇలాంటి వాటన్నింటికీ చెల్లు చీటీ అంటోంది కేంద్రం. ఏదైనా వస్తువు ఆఫర్లో వచ్చిందంటే ఎంత ఆనందం, డిస్కౌంట్‌లో వచ్చిందంటే ఎంత సంతోషం. వినియోగదారుడిని ఆకర్షించడం కోసం ఆ వస్తువు రేటు పెంచి తగ్గించారన్న బిజెనెస్ స్ట్రాటజీ మనకస్సలు గుర్తుకు రాదు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు ఈ- కామర్స్ సంస్థలను, ఇటు వినియోగదారులను నిరాశ పరుస్తోంది.

ఆన్‌లైన్ పోర్టళ్లలో హోరెత్తించే భారీ డిస్కౌంట్ ఆఫర్లకు తెరదించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఈ పోర్టళ్లు తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధం విధించింది. ఈ నిబంధనల ప్రకారం ఆయా పోర్టళ్లు తమకు లేదా తమ గ్రూపు వ్యాపారాలకు ఈక్విటీ వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు అనుమతి ఉండదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారులను ఆకర్షించే దిశగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ- కామర్స్ సంస్థలు అసాధారణ స్థాయిలో డిస్కౌంట్లను ఇచ్చుకుంటూ పోతే తమ వ్యాపారానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ దేశంలోని పలు వర్తక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో వ్యాపారస్తుల ఫిర్యాదులను స్వీకరించిన ప్రభుత్వం తాజాగా ఈ చర్యలు చేపట్టి తక్షణం అమలు పరచాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.