ఇదేం చిత్రమో.. 65 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మ.. ఆనందంలో 85 ఏళ్ల భర్త

ఇదెక్కడి గోల.. సైన్స్ అభివృద్ధి చెందిందంటే సంతోషించాం. కొత్త కొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతోందంటే ఆనందించాం. పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన కొత్త టెక్నాలజీకి స్వాగతం పలికాం. మరీ విచిత్రం కాకపోతే కృష్ణా రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తూ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో బిడ్డకు జన్మనివ్వడమేంటి అని విన్న అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

లేటు వయసులో ఘాటు ప్రేమకు గుర్తుగా ఈ అద్భుతం జరిగింది.. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా ఆసుపత్రిలో 65 ఏళ్ల మహిళ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. ఈ వయసులో బిడ్డకు జన్మనివ్వడమనేది వైద్య చరిత్రలోనే అరుదైన సంఘటన అని వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆమె భర్త హకీం దిన్ వయస్సు 80 ఏళ్లు కావడం మరో వింత. ఈ జంటకు 11 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇప్పుడు రెండో కాన్పులో ఆడ బిడ్డ పుట్టింది.

అయితే ఇదే రికార్డ్ అని అనుకోడానికి లేదు.. ఈమె కంటే ఓ సంవత్సరం ఎక్కువ వయసు వున్న స్పెయిన్‌కు చెందిన 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్ బౌసదా దెలారా ఓ అడుగు ముందుకు వేసి మరీ ఆ వయసులో ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చింది. సహజంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది మాత్రం హకీం భార్య అని రికార్డులు చెబుతున్నాయి.