అసలే పైలెట్‌.. అర్జెంట్‌గా టాయ్‌లెట్ వస్తే..

ఎక్కడ ఉన్నా ఎవరు పిలిచినా పలక్కపోయినా ప్రకృతి పిలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే. లేకపోతే కడుపు ఉబ్బి పోయి మిగిలిన పని చేయలేరు. బస్ అయితే డ్రైవర్‌ని బతిమాలితే కాసేపు బస్ ఆపుతాడు. పని కానిచ్చొచ్చు. ట్రైన్ అయితే ఇంకా హాపీ. ఎవరికీ చెప్పక్కరలేదు. ఎక్కడికీ వెళ్లక్కరలేదు. అందులోనే టాయ్‌లెట్లు ఉండడంతో ఎప్పుడు కావాలంటే అప్పడు వెళ్లవచ్చు.

ఫ్లైట్‌లో కూడా టాయ్‌లెట్లు ఉంటాయి. అయితే మార్గమధ్యలో టాయిలెట్ వస్తే ఏంటి పరిస్థితి. కారు పార్క్ చేసినట్లు విమానాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపి టాయిలెట్‌కి వెళతారా. వినడానికే విచిత్రంగా ఉంది కదూ.

అమెరికాలోని అలంబా హైవే మీద కారులో వెళుతున్న ఓ జంట రోడ్డుపై ఓ చిన్న విమానం ఆగడాన్ని చూశారు. ఇదేంటి విమానం ఇక్కడ ఉంది అని అనుకునేలోపు పక్కనే కొద్ది దూరంలో పైలెట్ టాయిలెట్ చేస్తూ కనిపించారు. ఇంతకీ విషయం ఏంటని విచారిస్తే..

ఈ బుల్లి విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో ట్రైనీ పైలెట్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఇంతలో ప్రకృతి పిలిచింది టాయ్‌లెట్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆపుకోవడం వల్ల కాలేదు పైలెట్‌కి. వెంటనే రోడ్డు పక్కకు వెళ్లి కడుపులో భారాన్ని దించేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.